Loading...
Shubman Gill: ఇంగ్లండ్ గడ్డపై గిల్ సంచలనం.. 12 ఏళ్ల రికార్డును తిరగరాసిన టీమిండియా!
ఇంగ్లండ్ గడ్డపై గిల్ సంచలనం.. 12 ఏళ్ల రికార్డును తిరగరాసిన టీమిండియా!

Shubman Gill: ఇంగ్లండ్ గడ్డపై గిల్ సంచలనం.. 12 ఏళ్ల రికార్డును తిరగరాసిన టీమిండియా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 15, 2026
11:18 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో భారత జట్టు ఇంగ్లండ్‌ పర్యటనలో శుభారంభం చేయడమే కాకుండా, కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ సారథ్యంలో చరిత్రాత్మక ఘనతను కూడా అందుకుంది. ఈ విజయంతో గత 12 ఏళ్లలో ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌ను ఓడించిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది. 2015 నుంచి ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌ ఆడిన ఏడు వన్డేల్లో ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. అంతకుముందు 2014లో ఇదే మైదానంలో ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది కూడా భారత్‌నే. ఇప్పుడు మరోసారి 12 ఏళ్ల తర్వాత శుబ్‌మన్‌ గిల్‌ నాయకత్వంలో భారత జట్టు ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌ విజయ పరంపరకు తెరదించింది.

వివరాలు

ఇంగ్లండ్‌పై వరుసగా ఆరో వన్డే విజయం

ఇంగ్లండ్‌పై వన్డేల్లో భారత్‌కు ఇది వరుసగా ఆరో విజయం. దీంతో ఇంగ్లిష్‌ జట్టుపై తన విజయ పరంపరను టీమిండియా మరింత పొడిగించింది.

గతంలో కూడా మూడు వేర్వేరు సందర్భాల్లో భారత్‌ ఇంగ్లండ్‌పై వరుసగా ఐదేసి వన్డే విజయాలు నమోదు చేసింది.

ఇప్పుడు ఆ రికార్డును అధిగమిస్తూ వరుసగా ఆరో విజయాన్ని అందుకుంది.

వివరాలు

కోహ్లీ, రోహిత్‌ విఫలమైనా లక్ష్య ఛేదన

విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మలు పెద్ద స్కోర్లు చేయకపోయినా 250కిపైగా లక్ష్యాన్ని ఛేదించడం 2016 తర్వాత టీమిండియాకు ఇది కేవలం రెండోసారి మాత్రమే.

అంతకుముందు 2022లో ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో 260 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ విజయవంతంగా ఛేదించింది.

ఆ మ్యాచ్‌లో కూడా కోహ్లీ, రోహిత్‌లు చెరో 17 పరుగులకే పరిమితమయ్యారు.

ఇప్పుడు మరోసారి అదే ఇంగ్లండ్‌పై ఇద్దరు స్టార్‌ బ్యాటర్లు విఫలమైనా భారత జట్టు లక్ష్యాన్ని ఛేదించి మరో విశేషాన్ని నమోదు చేసింది.

ADVERTISEMENT