LOADING...
Champions Trophy 2025: గిల్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు.. మేనేజ్‌మెంట్‌పై అశ్విన్ ప్రశంసలు
గిల్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు.. మేనేజ్‌మెంట్‌పై అశ్విన్ ప్రశంసలు

Champions Trophy 2025: గిల్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు.. మేనేజ్‌మెంట్‌పై అశ్విన్ ప్రశంసలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 20, 2025
04:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును ప్రకటించిన సమయంలో వైస్ కెప్టెన్సీ చర్చ హాట్ టాపిక్‌గా మారింది. చివరికి రోహిత్ శర్మకు డిప్యూటీగా శుభ్‌మన్ గిల్‌ను నియమిస్తూ జట్టు సెలక్టర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. గిల్‌ను ఈ బాధ్యతలకు ఎంపిక చేయడం భవిష్యత్‌లో అతడిని వన్డే జట్టుకు కెప్టెన్‌గా నడిపించే ప్రణాళికల్లో భాగంగా ఉందని భావిస్తున్నారు. గతంలో గిల్ జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌కు నాయకత్వం వహించడమే కాకుండా, శ్రీలంకతో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లకు ఉప నాయకుడిగా కూడా వ్యవహరించారు. జట్టును ప్రకటించిన సందర్భంగా భారత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడారు. భవిష్యత్‌ నాయకత్వ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.

Details

గిల్ స్థానం ఖాయం

గిల్ ఎంపికపై భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ మేనేజ్‌మెంట్‌ను ప్రశంసించాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో గిల్ కాకుండా మరో క్రికెటర్‌కు వైస్ కెప్టెన్సీ అప్పగిస్తే సరైనదా అని ప్రశ్నించారు. గతంలో కొన్ని సిరీసుల్లోనూ గిల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించారని గుర్తు చేశారు. భవిష్యత్‌లో భారత జట్టు నాయకుడిగా నిలిచేందుకు అతడిలో అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నాయన్నారు. మేనేజ్‌మెంట్ దీన్ని ముందుగానే అంచనా వేసి నిర్ణయం తీసుకుందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. గిల్ వైస్ కెప్టెన్ కావడంతో ఫైనల్‌ XIలో అతడి స్థానం ఖాయమన్నారు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ తుది జట్టులో చోటు కోసం పోటీలో ఉంటారని, ఇక వికెట్ కీపింగ్ బాధ్యతల కోసం రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ ఉన్నారన్నారు.