LOADING...
FIFA World Cup 2026 : గోల్ కొట్టినా ఇవ్వలేదు.. ఆస్ట్రియాకు షాక్ ఇచ్చిన VAR.. అసలు ఏం జరిగిందంటే?
గోల్ కొట్టినా ఇవ్వలేదు.. ఆస్ట్రియాకు షాక్ ఇచ్చిన VAR.. అసలు ఏం జరిగిందంటే?

FIFA World Cup 2026 : గోల్ కొట్టినా ఇవ్వలేదు.. ఆస్ట్రియాకు షాక్ ఇచ్చిన VAR.. అసలు ఏం జరిగిందంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 18, 2026
09:55 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫిఫా ప్రపంచకప్‌ 2026లో ఆస్ట్రియా విజయంతో తమ ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించింది. గ్రూప్‌-జేలో భాగంగా శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియా స్టేడియంలో జోర్డాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 3-1 తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రియా సాధించిన ఒక గోల్‌ను రిఫరీ రద్దు చేయడం పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా వీడియో అసిస్టెంట్ రిఫరీ (VAR) జోక్యంతో తీసుకున్న ఆ నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్ ప్రారంభం నుంచే ఆస్ట్రియా దూకుడుగా ఆడింది. తొలి అర్థభాగంలో మిడ్‌ఫీల్డర్ రొమానో ష్మిడ్ బాక్స్ వెలుపల నుంచి అద్భుతమైన షాట్‌తో గోల్ సాధించి జట్టుకు 1-0 ఆధిక్యం అందించాడు. ఆ గోల్‌తోనే ఆస్ట్రియా హాఫ్‌టైమ్‌కు ఆధిక్యంలో వెళ్లింది.

వివరాలు

స్కోరు 1-1తో సమం

రెండో అర్థభాగం ప్రారంభమైన కొద్ది సేపటికే జోర్డాన్ సమాధానం ఇచ్చింది. 50వ నిమిషంలో అలీ ఇయాద్ ఒల్వాన్ బాక్స్ అంచు నుంచి కర్లింగ్ షాట్ ఆడగా, బంతి పోస్టును తాకి గోల్‌లోకి వెళ్లింది. దీంతో స్కోరు 1-1తో సమమైంది. స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఈ క్రమంలో 66వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన మార్కో ఆర్నాటోవిచ్ గోల్ సాధించి ఆస్ట్రియాకు మరోసారి ఆధిక్యం తీసుకొచ్చినట్లు కనిపించింది. అయితే VAR పరిశీలనలో ఆ క్రమంలో బంతి ఆస్ట్రియా ఆటగాడు స్టెఫాన్ పోష్ చేతిని తాకినట్లు గుర్తించారు. అనంతరం ప్రధాన రిఫరీ సుదీర్ఘ సమీక్ష నిర్వహించి గోల్‌ను రద్దు చేశారు.

వివరాలు

తన

దీంతో ఆస్ట్రియా శిబిరంలో నిరాశ నెలకొంది. అయితే కొద్ది నిమిషాలకే ఆస్ట్రియాకు అదృష్టం కలిసి వచ్చింది. జోర్డాన్ డిఫెండర్ యజాన్ అల్-అరబ్ కార్నర్‌ను క్లియర్ చేయబోయే ప్రయత్నంలో పొరపాటున బంతిని తన సొంత గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. ఈ సెల్ఫ్‌ గోల్‌తో ఆస్ట్రియా మళ్లీ ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక అదనపు సమయంలో ఆస్ట్రియాకు పెనాల్టీ లభించగా, మార్కో ఆర్నాటోవిచ్ ఎలాంటి తప్పు చేయకుండా దానిని గోల్‌గా మలిచాడు. దీంతో ఆస్ట్రియా 3-1 తేడాతో జోర్డాన్‌ను ఓడించి ఫిఫా ప్రపంచకప్‌ 2026లో విజయంతో బోణీ కొట్టింది. కాగా VAR కారణంగా రద్దైన గోల్ ఈ మ్యాచ్‌లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

Advertisement