Lionel Messi: 'గోట్ టూర్ ఆఫ్ ఇండియా'.. కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, దిల్లీ పర్యటనలో లియోనల్ మెస్సీ
ఈ వార్తాకథనం ఏంటి
భారత ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ శనివారం భారత్‌లో అడుగుపెట్టనున్నాడు. 'గోట్ టూర్ ఆఫ్ ఇండియా' పేరుతో నిర్వహిస్తున్న ఈ పర్యటనలో భాగంగా మెస్సి శనివారం తెల్లవారుజామున కోల్‌కతాకు చేరుకోనున్నాడు. ఇప్పటికే కోల్‌కతా నగరం మొత్తం మెస్సి జపంతో ఉర్రూతలూగుతోంది. 2011 తర్వాత మెస్సి భారత్‌కు రావడం ఇదే తొలిసారి. అయితే అప్పటిలా ఈసారి ఫుట్‌బాల్ మ్యాజిక్ చూడబోయేది లేదు. 2011లో కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ స్టేడియంలో 85 వేల మంది ప్రేక్షకుల మధ్య మెస్సి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడాడు. వెనెజులాతో జరిగిన ఫిఫా స్నేహపూర్వక మ్యాచ్‌లో అర్జెంటీనా జట్టు 1-0తో విజయం సాధించింది.
Details
78 వేల సీట్లు అందుబాటులో
కానీ ఈసారి 'గోట్ టూర్' షెడ్యూల్‌లో భాగంగా మెస్సి ఎలాంటి సీరియస్ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడటం లేదు. ఈ పర్యటన పూర్తిగా ప్రమోషనల్ కార్యక్రమాలకు పరిమితమైంది. ఇందులో వాణిజ్య కోణమే ఎక్కువగా కనిపిస్తోంది. శనివారం ప్రారంభమయ్యే ఈ గోట్ పర్యటన సోమవారంతో ముగియనుంది. మెస్సి ఈసారి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడకపోయినా, ఫుట్‌బాల్‌ను హృదయపూర్వకంగా ప్రేమించే కోల్‌కతా నగరానికి అతడి రాక ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. శనివారం మెస్సి సాల్ట్‌లేక్ స్టేడియంలో 45 నిమిషాల కార్యక్రమంలో పాల్గొననున్నాడు. ఇందుకోసం 78 వేల సీట్లు అందుబాటులో ఉంచనున్నారు.
Details
ముఖ్యమంత్రులు కలిసే అవకాశం
మొత్తం 72 గంటల కంటే తక్కువ సమయం మాత్రమే భారత్‌లో గడపనున్న మెస్సి, కోల్‌కతాతో పాటు హైదరాబాద్, ముంబయి, దిల్లీ నగరాల్లో పర్యటించనున్నాడు. ఈ పర్యటనలో అతడితో పాటు ఇంటర్ మియామీ జట్టు సహచరులు రోడ్రిగో డిపాల్, లూయిస్ సువారెజ్ కూడా భారత్‌కు రానున్నారు. ఈ టూర్‌లో భాగంగా మెస్సి ముఖ్యమంత్రులు, కార్పొరేట్ దిగ్గజాలు, బాలీవుడ్ సెలెబ్రిటీలు, అలాగే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలవనున్నాడు.
Details
గోట్ టూర్ షెడ్యూల్ ఇలా
నేడు కోల్‌కతా, హైదరాబాద్‌లో మెస్సి బృందం కోల్‌కతాలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేయనుంది. లేక్‌టౌన్‌లో ఏర్పాటు చేసిన తన 70అడుగుల విగ్రహాన్ని మెస్సి వర్చువల్‌గా ఆవిష్కరించనున్నాడు. భద్రతా కారణాల దృష్ట్యా అక్కడికి ప్రత్యక్షంగా వెళ్లడం లేదు. అనంతరం సాల్ట్‌లేక్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటాడు. ఉదయం10 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఈవెంట్‌లో మెస్సి టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలను కలవనున్నాడు. కోల్‌కతాలో కార్యక్రమం ముగియగానే మెస్సి హైదరాబాద్‌కు బయలుదేరతాడు. అక్కడ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటాడు. అనంతరం 'గోట్ కప్' పేరుతో ఉప్పల్ స్టేడియంలో నిర్వహించే ఎగ్జిబిషన్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో మెస్సి ఆడనున్నాడు.
Details
14న ముంబయిలో…
రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొననున్నారు. ఆదివారం మెస్సి ముంబయిలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటాడు. ధార్మిక కార్యక్రమాల కోసం నిర్వహించే ఫ్యాషన్ షోలో మెస్సి హాజరవుతాడు. అనంతరం క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో క్రికెట్ స్టార్లతో కలిసి పికిల్‌బాల్ ఆడనున్నాడు. ఈ కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్ కూడా పాల్గొననున్నారని సమాచారం. ఆ తర్వాత వాంఖడే స్టేడియంలో జరిగే ఈవెంట్‌లో పాల్గొంటాడు. అక్కడ 60 మంది చిన్నారులతో కోచింగ్ క్లినిక్ నిర్వహించనున్నాడు.
Details
15న దిల్లీలో
తన పర్యటన చివరి దశలో మెస్సి దిల్లీకి చేరుకుని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే ఈవెంట్‌లో పాల్గొంటాడు. అక్కడ కూడా చిన్నారుల కోసం కోచింగ్ క్లినిక్ నిర్వహించనున్నారు. అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలవడంతో 'గోట్ టూర్ ఆఫ్ ఇండియా' అధికారికంగా ముగుస్తుంది.