LOADING...
BCCI: మహిళా క్రికెటర్లకు శుభవార్త.. దేశవాళీ మ్యాచ్‌ ఫీజులు భారీగా పెంపు
మహిళా క్రికెటర్లకు శుభవార్త.. దేశవాళీ మ్యాచ్‌ ఫీజులు భారీగా పెంపు

BCCI: మహిళా క్రికెటర్లకు శుభవార్త.. దేశవాళీ మ్యాచ్‌ ఫీజులు భారీగా పెంపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 23, 2025
09:01 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశవాళీ క్రికెట్లో మహిళా క్రికెటర్లతో పాటు మ్యాచ్‌ అధికారుల మ్యాచ్‌ ఫీజులను బీసీసీఐ రెట్టింపుకన్నా ఎక్కువగా పెంచింది. ఈ నిర్ణయంతో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్న మహిళా క్రీడాకారులకు ఆర్థిక భద్రత మరింత బలపడనుంది. భారత్‌ తొలిసారిగా మహిళల వన్డే ప్రపంచకప్‌ను గెలిచిన నేపథ్యంలో బోర్డు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఫీజుల పెంపుదల ప్రతిపాదనకు బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. సవరించిన చెల్లింపు విధానం ప్రకారం సీనియర్‌ మహిళల దేశవాళీ వన్డే టోర్నమెంట్‌తో పాటు బహుళ రోజుల టోర్నీల్లో తుది జట్టులో చోటు దక్కిన ఆటగాళ్లకు రోజుకు రూ.50 వేలు చెల్లిస్తారు. ఇప్పటివరకు ఈ ఫీజు రూ.20 వేలు మాత్రమే ఉండేది. రిజర్వ్‌ ఆటగాళ్లకు రోజుకు రూ.25 వేలు అందజేస్తారు.

Details

మహిళా క్రికెటర్లకు రోజుకు రూ.25వేలు

జాతీయ టీ20 టోర్నీల్లో తుది జట్టులో ఉన్న మహిళా క్రికెటర్లకు రోజుకు రూ.25 వేలు చెల్లించనుండగా, రిజర్వ్‌లకు రూ.12,500 ఇవ్వనున్నారు. ఈ సవరించిన విధానంతో అన్ని ఫార్మాట్లలో ఆడే అగ్రశ్రేణి మహిళా క్రికెటర్లు ఒక సీజన్‌లో రూ.12 లక్షల నుంచి రూ.14 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశముంది. అండర్‌-23, అండర్‌-19 విభాగాల్లో పాల్గొనే మహిళా క్రికెటర్లకూ భారీగా ఫీజులు పెరిగాయి. ఈ విభాగాల్లో తుది జట్టులో ఉన్న ఆటగాళ్లకు రోజుకు రూ.25 వేలు చెల్లిస్తారు. రిజర్వ్‌ ప్లేయర్లకు రోజుకు రూ.12,500 లభిస్తాయి.

Details

 అంపైర్లు, రిఫరీల ఆదాయం కూడా పెంపు

ఇక దేశవాళీ మ్యాచ్‌లకు విధులు నిర్వహించే అంపైర్లు, రిఫరీల ఆదాయం కూడా గణనీయంగా పెరగనుంది. లీగ్‌ మ్యాచ్‌లకు రోజుకు రూ.40 వేలు అందుకుంటారు. నాకౌట్‌ మ్యాచ్‌ల విషయంలో మ్యాచ్‌ ప్రాధాన్యతను బట్టి రోజుకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఫీజు చెల్లిస్తారు. ఈ లెక్కన ఓ అంపైర్‌ రంజీ ట్రోఫీ లీగ్‌ మ్యాచ్‌కు సుమారు రూ.1.60 లక్షలు, నాకౌట్‌ మ్యాచ్‌కు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఆర్జించే అవకాశం ఉంది.

Advertisement