LOADING...
IPL 2026: విజృంభించిన గిల్..ఫైనల్స్‌కి చేరిన గుజరాత్
విజృంభించిన గిల్..ఫైనల్స్‌కి చేరిన గుజరాత్

IPL 2026: విజృంభించిన గిల్..ఫైనల్స్‌కి చేరిన గుజరాత్

వ్రాసిన వారు Moogati Shabari
May 29, 2026
11:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌-2026 క్వాలిఫయర్‌-2లో ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఈ పోరులో గుజరాత్ జట్టు అద్భుతమైన ఛేజింగ్‌తో 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో ఆదివారం జరగనున్న ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది.

వివరాలు

వైభవ్ సెంచరీ మిస్..

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. అయితే తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. కేవలం 4 పరుగుల దూరంలో శతకాన్ని మిస్ చేసుకున్న వైభవ్.. 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 96 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడికి తోడుగా డొనొవాన్ ఫెరీరా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 11 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 38 పరుగులు చేశాడు.

వివరాలు

గిల్ అదిరిపోయే రికార్డు..

215 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ముఖ్యంగా కెప్టెన్ శుభమన్ గిల్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో గిల్ మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్ కెరీర్‌లో తన 5వ సెంచరీ నమోదు చేసిన గిల్.. టోర్నీలో 4,500 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో కూడా చోటు సంపాదించాడు. చివరకు గుజరాత్ టైటాన్స్ 18.4 ఓవర్లలోనే 219 పరుగులు చేసి విజయం ఖాయం చేసింది. దీంతో ఫైనల్లో ఆర్సీబీతో టైటిల్ పోరుకు సిద్ధమైంది. ఆదివారం జరిగే ఈ తుది పోరు అభిమానుల్లో భారీ ఆసక్తి రేకెత్తిస్తోంది.

Advertisement