Loading...
World Chess Championship: ప్రపంచ చెస్‌ చాంపియన్‌ షిప్‌...డ్రాగా ముగిసిన తొలిగేమ్
ప్రపంచ చెస్‌ చాంపియన్‌ షిప్‌...డ్రాగా ముగిసిన తొలిగేమ్

World Chess Championship: ప్రపంచ చెస్‌ చాంపియన్‌ షిప్‌...డ్రాగా ముగిసిన తొలిగేమ్

వ్రాసిన వారు Balachander Sharma
Nov 25, 2026
10:48 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ డి. గుకేష్‌ శుభారంభం చేశాడు. ఉజ్బెకిస్థాన్‌ ఛాలెంజర్‌ జవోఖిర్‌ సిందరోవ్‌తో మంగళవారం జరిగిన తొలి గేమ్‌ను డ్రాగా ముగించాడు. నల్ల పావులతో బరిలోకి దిగిన గుకేష్‌ ఆరంభం నుంచే ప్రత్యర్థి నుంచి ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. ఒక దశలో సిందరోవ్‌ వద్ద గంటకు పైగా సమయం ఉండగా.. గుకేష్‌ దగ్గర మాత్రం 29 నిమిషాలే మిగిలాయి. అయినా తొందరపడకుండా ప్రతి ఎత్తును ఆచితూచి వేస్తూ ఆటను తనకు అనుకూలంగా మలుచుకున్నాడు.

Details

27వ ఎత్తు.. ఆటను మార్చేసిన క్షణం

స్విట్జర్లాండ్‌లో జరిగిన ఈ పోరులో సిందరోవ్‌ ఆధిక్యం సాధించే ప్రయత్నం చేశాడు.

గుకేశ్‌ మాత్రం సమయ ఒత్తిడిని అధిగమిస్తూ రక్షణాత్మకంగా, అదే సమయంలో పదునైన ఎత్తులతో బదులిచ్చాడు.

ముఖ్యంగా 27వ ఎత్తులో వేసిన గుకేష్‌ రక్షణాత్మక ఎత్తు ఆట స్వరూపాన్ని మార్చింది.

అప్పటివరకు ప్రత్యర్థి ఒత్తిడిలో ఉన్న భారత ఆటగాడు క్రమంగా పరిస్థితిని సమం చేశాడు.

చివరకు 38 ఎత్తుల తర్వాత ఒకే పొజిషన్‌ మూడుసార్లు పునరావృతం కావడంతో నిబంధనల ప్రకారం గేమ్‌ డ్రాగా ముగిసింది.

Details

గుకేష్‌దే మానసిక విజయం

గుకేష్‌ పోరాటంపై ప్రముఖ గ్రాండ్‌మాస్టర్‌ పీటర్‌ లెకో ప్రశంసలు కురిపించారు.

నల్ల పావులతో ఆడుతూ ఇంతటి ఒత్తిడిని ఎదుర్కొన్నా గుకేష్‌ అద్భుతంగా నిలబడ్డాడని, మానసికంగా చూస్తే ఈ గేమ్‌లో అతడే విజేత అని వ్యాఖ్యానించారు.

డ్రాతో గుకేష్‌, సిందరోవ్‌ ఇద్దరికీ చెరో అర పాయింట్‌ లభించింది. ముఖ్యంగా సమయ ఒత్తిడిలో ఓటమిని తప్పించుకోవడం గుకేష్‌కు ఈ గేమ్‌లో పెద్ద ఊరటనిచ్చింది.

ADVERTISEMENT

Details

ఇప్పుడు తెల్ల పావులతో అసలు పరీక్ష

తొలి గేమ్‌లో డ్రాతో గుకేష్‌ ఖాతా తెరిచాడు. ఇక బుధవారం జరిగే రెండో గేమ్‌లో అతడు తెల్ల పావులతో ఆడనున్నాడు.

తెల్ల పావులతో ప్రారంభించే అవకాశం గుకేష్‌కు అదనపు ప్రయోజనాన్ని ఇవ్వొచ్చు.

తొలి గేమ్‌లో ఎదురైన ఒత్తిడిని విజయవంతంగా అధిగమించడంతో అతడి ఆత్మవిశ్వాసం కూడా పెరిగే అవకాశం ఉంది.

దీంతో రెండో గేమ్‌పై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఛాంపియన్‌షిప్‌లో ముందంజ వేయాలంటే ఇకపై ప్రతి గేమ్‌లోనూ చిన్న తప్పిదానికీ అవకాశం లేకుండా ఆడాల్సి ఉంటుంది.

ADVERTISEMENT