హ్యాపీ బర్త్ డే పీటీ ఉష: 'పరుగుల రాణి' ఎన్ని అవార్డులు గెలుచుకుందో తెలుసా!
దేశంలో ఎంతోమంది క్రీడాకారులకు పీటీ ఉష స్ఫూర్తిగా నిలిచింది. ఆమె పరుగులు పెడితే పతకం గెలవాల్సిందే. 16ఏళ్ల వయస్సులోనే 1980 మాస్కో ఒలింపిక్స్‌లో పాల్గొంది. అలా అని పాతికేళ్లొచ్చాక ఆటకు టాటా చెప్పకుండా 34 ఏళ్ల వయస్సులోనూ పతకం సాధించి రికార్డు సృష్టించింది. అందుకే ఆమె పరుగుల రాణి అయింది. నేడు ఆమె 59వ పుట్టిన రోజు సందర్భంగా ఆమె సాధించిన రికార్డుల గురించి తెలుసుకుందాం. 1976 కోజికోడ్లో జన్మించిన ఆమె 1980-90 దశకాల్లో ఎన్నో అరుదైన రికార్డులను నెలకొల్పింది. ఆ తరంలో ప్రపంచంలోనే వేగవంతంమైన అథ్లెట్లలో ఒకరిగా నిలిచింది. న్యూదిల్లీ ఆసియా క్రీడల్లో (1982)లో టీనేజ్ స్ప్రింటర్ 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులో రజతాలు సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది.
1985లో బెస్ట్ రైల్వే అథ్లెట్ గా గుర్తింపు
ఆ మరుసటి ఏడాదే (1983) కువైటు ఆతిథ్యమిచ్చిన ఆసియా ఛాంపియన్ షిప్ లో పసిడి గెలిచి అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. ఇక 1985లో బెస్ట్ రైల్వే అథ్లెట్ గా గుర్తింపు పొందింది. అదే ఏడాది జకార్తా వేదికగా జరిగిన ఆసియన్ ఛాంపియన్ షిప్ లో ఏకంగా ఐదు బంగారు పతకాలతో పాటు ఒక కాంస్య కూడా తన ఖాతాలో వేసుకుంది. 1989 ఆసియన్ ఛాంపియన్స్, 1990 ఆసియా క్రీడల్లో కలిపి నాలుగు పసిడి పతకాలు, ఐదు రజతాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక 1990 ఆసియన్ గేమ్స్ లో ఆమె మూడు సిల్వర్ పతకాలు సాధించి ఆదే ఏడాది రిటైర్ మెంట్ ప్రకటించింది.
1984లో అర్జున అవార్డును సాధించిన పీటీ ఉష
అదే ఏడాది రిటైర్‌మెంట్ వెనక్కి తీసుకొని అట్లాంటా ఒలింపిక్ గేమ్స్ లో పాల్గొన్న ఆమె త్రుటిలో పతకం చేజార్చుకుంది. 1999లో కాఠ్మండులో జరిగిన ఎస్ఏఎఫ్ గేమ్స్‌లో స్వర్ణం, రెండు రజతాలు సాధించింది. అలాగే ఢిల్లీలో జరిగిన రాజా బలీంద్ర సింగ్ అంతర్జాతీయ అథ్లెట్ మీట్ లో ఇంకో పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. అదే విధంగా 1984లోనే అర్జున అవార్డు అందుకున్న ఆమె, ఏడాది తర్వాత పద్మశ్రీ పురస్కారాన్ని దక్కించుకుంది. తాజాగా ఆమె ఇండియన్ ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా బాధ్యతలను చేపట్టింది. ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా ఆమె రికార్డు సాధించింది. ఈ పరుగుల రాణి మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని అభిమానులు సోషల్ మీడియాలో విష్ చేస్తున్నారు.