పృథ్వీ షాకు ఊరట.. స్వప్న గిల్ ఆరోపణలన్నీ అవాస్తవమన్న ముంబై పోలీసులు
వేధింపుల కేసు నుంచి టీమిండియా క్రికెటర్ పృథ్వీ షాకు ముంబై పోలీసులు క్లీన్ చీట్ ఇచ్చారు. లైంగికంగా పృథ్వీషా తనను వేధించాడంటూ బోజ్ పురి నటి అయిన స్వప్నా గిల్ చేసిన ఆరోపణలను ముంబై పోలీసులు కొట్టిపారేశారు. స్వప్నా గిల్ ఆరోపణలన్నీ అవాస్తవమని తేల్చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పృథ్వీ షా ఓ పార్టీలో సెల్ఫీ అడిగినందుకు గాను తనపై అసభ్యంగా ప్రవర్తించి, తన ప్రైవేట్ పార్ట్స్ తాకాడని స్వప్నా గిల్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై ముంబై పోలీసులు స్పందించారు. షాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, ఈ వ్యవహారంలో అతడి తప్పేమీ లేదని స్పష్టం చేశారు. ఈ కేసులో పృథ్వీ షాకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు.
పృథ్వీ షా వేధింపులకు పాల్పడలేదు
స్వప్నా గిల్ మద్యం మత్తులో పృథ్వీషాను ఇబ్బంది పెట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. పృథ్వీ షా సెల్ఫీ అడిగితే ఇవ్వడానికి నిరాకరించడంతో ఆమెనే పృథ్వీషా కారును వెంబడించిందని, ఆమెపై పృథ్వీషా వేధింపులకు పాల్పడినట్లు ఎలాంటి సాక్ష్యాలు లభ్యం కాలేదని పోలీసులు ఈ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ వ్యవహారం షాకు కాస్త ఊరటను కలిగించింది. ఇక ఐపీఎల్-16వ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున అతను దారుణంగా విఫలమయ్యాడు. తర్వాతి సీజన్లో అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ వదులుకోనున్నట్లు సమాచారం. ఐపీఎల్ 2024లో పృథ్వీ షా సన్ రైజర్స్ కు ప్రాతినిథ్యం వహించే అవకాశాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.