Harbhajan Singh: కోల్‌కతా ఘటనపై మమతా బెనర్జీకి హర్భజన్ సింగ్ లేఖ
కోల్‌కతాలో ట్రైనీ మహిళా డాక్టర్ పై అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ హత్యాచారంపై డాక్టర్లు, మెడికోలు చేపట్టిన నిరసనలు ప్రదర్శనలు మరో మలుపు తిరిగాయి. తాజాగా ఈ వ్యవహారంపై టీమిండియా మాజీ క్రికెటర్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ హర్బజన్ సింగ్ స్పందించారు. బాధితురాలికి న్యాయం చేయడంలో జరుగుతున్న జాప్యం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ భజ్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లేఖ రాశారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి
మహిళల భద్రత, గౌరవం విషయంలో రాజీపడదని, నేరస్థులను కఠినంగా శిక్షించాలని హర్బజన్ సింగ్ కోరారు. నేరస్థులకు పడే శిక్ష మన సిస్టమ్‌పై విశ్వాసాన్ని పొందేలా ఉండాలని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలను రక్షించే ప్రదేశంలో ఇంతటి ఘోరం జరగడం ఆమోదయోగ్యం కాదని మమతా బెనర్జీ, బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్‌లను ట్యాగ్ చేస్తూ తన 'ఎక్స్' ఖాతా వేదికగా హర్భజన్ సింగ్ పోస్ట్ చేశారు.