LOADING...
Harmanpreet Kaur: నేడు 200 టీ20 మ్యాచ్‌ల మైలురాయిని చేరనున్న హర్మన్‌ప్రీత్ కౌర్
నేడు 200 టీ20 మ్యాచ్‌ల మైలురాయిని చేరనున్న హర్మన్‌ప్రీత్ కౌర్

Harmanpreet Kaur: నేడు 200 టీ20 మ్యాచ్‌ల మైలురాయిని చేరనున్న హర్మన్‌ప్రీత్ కౌర్

వ్రాసిన వారు Moogati Shabari
Jun 21, 2026
10:41 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అంతర్జాతీయ క్రికెట్‌లో మరో చారిత్రక ఘట్టానికి చేరువైంది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జూన్ 21న మాంచెస్టర్‌లో దక్షిణాఫ్రికాతో జరగనున్న గ్రూప్-ఏ మ్యాచ్‌లో బరిలోకి దిగనుండగా, ఆమె కెరీర్‌లో 200వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ను ఆడబోతోంది. దీంతో పురుషులు, మహిళలు కలిపి టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 200 మ్యాచ్‌లు పూర్తి చేసిన తొలి క్రికెటర్‌గా హర్మన్‌ప్రీత్ ప్రపంచ రికార్డు సృష్టించనుంది. 37 ఏళ్ల హర్మన్‌ప్రీత్ ఈ ఘనతతో మహిళల క్రికెట్‌లో అత్యధిక టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన న్యూజిలాండ్ స్టార్ సూజీ బేట్స్ (184 మ్యాచ్‌లు)ను మరింత వెనక్కి నెట్టనుంది.

వివరాలు

2009లో ప్రయాణం మొదలు..

అలాగే పురుషుల క్రికెట్‌లో అత్యధిక టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఐర్లాండ్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్ (163 మ్యాచ్‌లు), భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (159 మ్యాచ్‌లు) కంటే కూడా ఎంతో ముందంజలో నిలవనుంది. పంజాబ్‌కు చెందిన హర్మన్‌ప్రీత్ కౌర్ అంతర్జాతీయ టీ20 ప్రయాణం 2009లో ఇంగ్లండ్‌లో జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌తో ప్రారంభమైంది. గత 17 ఏళ్లుగా ఆమె అత్యుత్తమ ఫిట్‌నెస్, అంకితభావం, నిలకడైన ప్రదర్శనతో భారత జట్టులో కీలక సభ్యురాలిగా కొనసాగుతోంది. కెప్టెన్‌గా కూడా జట్టును విజయవంతంగా నడిపిస్తూ ఎన్నో గుర్తుండిపోయే విజయాలను అందించింది. ఆమె నాయకత్వంలోనే భారత మహిళల జట్టు గత ఏడాది మహిళల వన్డే ప్రపంచకప్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది.

వివరాలు

భారత క్రీడా చరిత్రలో మరో గర్వకారణం..

ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో దక్షిణాఫ్రికా 4-1 తేడాతో భారత్‌ను ఓడించిన నేపథ్యంలో ఈ పోరుపై ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే సెమీఫైనల్‌కు చేరే అవకాశాలు మరింత బలపడతాయి. పురుషుల క్రికెట్‌లో ఎవరూ చేరుకోకముందే మహిళల క్రికెట్‌లో ఒక ఆటగాడు 200 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల మైలురాయిని అందుకోవడం విశేషం. ఇది మహిళల క్రికెట్‌లో పెరుగుతున్న మ్యాచ్‌ల సంఖ్యతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆ క్రీడకు లభిస్తున్న ఆదరణకు నిదర్శనంగా నిలుస్తోంది. 2009లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్, నేడు ప్రపంచ క్రికెట్‌లో ప్రముఖ ఆటగాళ్లలో ఒకరిగా ఎదిగి ఈ అరుదైన ఘనతను అందుకోవడం భారత క్రీడా చరిత్రలో మరో గర్వకారణంగా నిలిచింది.

Advertisement