Mohammed Shami : టీమిండియాలో షమీ అధ్యాయం ముగిసిందా? యువ బౌలర్లకు గ్రీన్ సిగ్నల్, సీనియర్‌కు నో ఛాన్స్!
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి భారత జట్టులోకి తిరిగి వచ్చే అవకాశాలు దాదాపు ముగిసిపోయినట్లే కనిపిస్తున్నాయి. 2023 వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించిన ఈ అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్.. ప్రస్తుతం జాతీయ జట్టుకు పూర్తిగా దూరమయ్యాడు. షమీ చివరిసారిగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత తరఫున వన్డే మ్యాచ్ ఆడగా, అదే ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో చివరిసారిగా పొట్టి ఫార్మాట్‌లో బరిలోకి దిగాడు. ఇక టెస్టు క్రికెట్‌లో అతడు మ్యాచ్ ఆడి మూడేళ్లు దాటిపోయింది. గాయాలతో సుదీర్ఘకాలం పోరాడిన షమీ.. ఫిట్‌నెస్ సాధించిన తర్వాత దేశీయ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శనలు చేసినప్పటికీ, జాతీయ జట్టులో తన స్థానాన్ని తిరిగి సంపాదించుకోలేకపోతున్నాడు.
వివరాలు
15 మంది యువ ఫాస్ట్ బౌలర్లు గుర్తింపు
ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌కు కూడా సెలెక్టర్లు అతడిని ఎంపిక చేయకపోవడం దీనికి తాజా ఉదాహరణగా నిలిచింది.
ఇదిలా ఉండగా స్పోర్ట్‌స్టార్ నివేదిక భారత సెలక్షన్ కమిటీ దీర్ఘకాలిక ప్రణాళికలపై కీలక విషయాలను వెల్లడించింది.
ఈ నివేదిక ప్రకారం, రాబోయే సంవత్సరాల్లో భారత పేస్ బౌలింగ్ దళానికి ప్రధాన బలంగా నిలుస్తారని భావిస్తున్న 15 మంది యువ ఫాస్ట్ బౌలర్లను సెలెక్టర్లు గుర్తించారు.
మూడు ఫార్మాట్లను దృష్టిలో ఉంచుకుని ఈ జాబితాను రూపొందించినప్పటికీ, అందులో మహమ్మద్ షమీకి చోటు దక్కకపోవడం విశేషం.
దీంతో టీమిండియాలోకి తిరిగి రావాలన్న అతడి ఆశలకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది.
వివరాలు
యువ బౌలర్లను తక్కువ అంచనా వేయకూడదు
రాబోయే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌తో పాటు 2027వన్డే ప్రపంచకప్‌ను లక్ష్యంగా పెట్టుకుని జట్టును నిర్మించాలని ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ భావిస్తున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ఎక్కువగా యువ ఆటగాళ్లకే అవకాశాలు ఇవ్వాలని వారు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే భారత జట్టు మార్పుల దశలో ఉండగా, సీనియర్ ఆటగాళ్ల స్థానాలను యువ క్రికెటర్లు క్రమంగా భర్తీ చేస్తున్నారు.
అయితే టీమ్ మేనేజ్‌మెంట్ షమీని అన్ని ఫార్మాట్లలోనూ పక్కన పెట్టే దిశగా వెళ్తున్న తీరుపై భారత మాజీ కెప్టెన్ క్రిస్ శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
గుర్నూర్ బ్రార్, మోసిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్ ముగ్గురూ ప్రతిభావంతులైన బౌలర్లేనని, వారిని తక్కువ అంచనా వేయకూడదని ఆయన అన్నారు.
వివరాలు
యువ బౌలర్లకు ఛాన్స్
ఇంకా ప్రపంచకప్‌కు 15 నెలల సమయం ఉన్నందున ఈ యువ బౌలర్లకు జట్టులో చోటు దక్కే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
అయితే మహమ్మద్ షమీ లాంటి అనుభవజ్ఞుడైన, మ్యాచ్ విజేతగా నిరూపించుకున్న బౌలర్‌ను పూర్తిగా పక్కన పెట్టడం తనను ఆశ్చర్యానికి గురిచేస్తోందని శ్రీకాంత్ వ్యాఖ్యానించారు.
"షమీ అద్భుతమైన బౌలర్. కానీ జట్టు యాజమాన్యం అతడిని పనికిరాని ఆటగాడిగా మార్చేస్తున్న తీరు నాకు ఆశ్చర్యం కలిగిస్తోందని ఆయన ఓ టెలివిజన్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు.