LOADING...
Jasprit Bumrah: అన్నీ మ్యాచులు ఆడలేడు.. ఆసియా కప్‌లో బుమ్రా రోల్‌పై డివిలియర్స్ క్లారిటీ
అన్నీ మ్యాచులు ఆడలేడు.. ఆసియా కప్‌లో బుమ్రా రోల్‌పై డివిలియర్స్ క్లారిటీ

Jasprit Bumrah: అన్నీ మ్యాచులు ఆడలేడు.. ఆసియా కప్‌లో బుమ్రా రోల్‌పై డివిలియర్స్ క్లారిటీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 24, 2025
11:30 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో భారత పేసర్ జస్పిత్ బుమ్రా వర్క్‌లోడ్ కారణంగా కేవలం మూడు మ్యాచుల్లో మాత్రమే ఆడాడు. ఈ నిర్ణయంపై అప్పట్లో టీమ్ మేనేజ్‌మెంట్‌ తీరుపై విమర్శలొచ్చాయి. అయితే తాజాగా ఆసియా కప్ కోసం ప్రకటించిన జట్టులో బుమ్రా చోటు దక్కించుకున్నాడు. ఇప్పుడు అతడు అన్ని మ్యాచుల్లోనూ ఆడతాడా? లేకపోతే మళ్లీ ఎంపికలో మినహాయింపులు ఉంటాయా? అనే చర్చ క్రికెట్ వర్గాల్లో మొదలైంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'జస్పిత్ బుమ్రాను ఆసియా కప్ స్క్వాడ్‌లో చూడటం చాలా సంతోషంగా ఉంది. పూర్తిగా ఫిట్‌గా ఉన్న అతడు తన సత్తా చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు.

Details

వర్క్‌లోడ్‌పై ఎప్పుడూ పర్యవేక్షణ అవసరం

అయితే అతడిని కీలకమైన మ్యాచులకే ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలోనూ అలాంటి రిపోర్టులు చూశాను. ముఖ్యమైన సీనియర్ ఆటగాళ్లను మేనేజ్ చేయడం సెలక్టర్లకు బాగా తెలుసు. 30 ఏళ్లు దాటిన ప్లేయర్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వారి వర్క్‌లోడ్‌పై ఎప్పుడూ పర్యవేక్షణ అవసరం. గతేడాది కూడా బుమ్రా గాయాల వల్ల ఇబ్బంది పడ్డాడు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీ చివర్లో అతడు గాయపడి, ఛాంపియన్స్ ట్రోఫీని మిస్ అయ్యాడు. అలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా ఉండేందుకే ఇంగ్లాండ్ సిరీస్‌లో జాగ్రత్తగా అతడిని ఆడించారు. ఇప్పుడు ఆసియా కప్ జట్టులోకి తీసుకున్నారు.

Details

తీవ్రంగా స్పందించిన మహ్మద్ కైఫ్

ఇలాంటి ఆటగాళ్లను కీలకమైన సందర్భాల్లో ఆడిస్తే అత్యుత్తమ ప్రదర్శన సాధ్యం అవుతుందని డివిలియర్స్ అన్నారు. మరోవైపు, బుమ్రా ఆడిన ఇంగ్లాండ్ టెస్టుల్లో భారత్ విజయాన్ని సాధించలేకపోయింది. దీంతో సోషల్ మీడియాలో అతడిపై అనుచిత వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా తన కుమారుడితో దిగిన ఫొటోపైనా విమర్శలొచ్చాయి. ఈ కామెంట్లపై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తీవ్రంగా స్పందించారు. 'మాటలను జాగ్రత్తగా వాడాలి. బుమ్రా ఎన్నో మ్యాచుల్లో ఒంటరిగా భారత్‌కు విజయాలు అందించాడు. అతడి గణాంకాలను చూసి మాట్లాడితే వాస్తవం తెలుస్తుంది. బుమ్రా భారత క్రికెట్‌కు దొరికిన అమూల్య వజ్రం. అతడిపై ఒక్క మచ్చ కూడా లేదని కైఫ్ వ్యాఖ్యానించాడు.