Commonwealth Games: జూడోలో భారత్ చరిత్ర.. ఒకే రోజు రెండు స్వర్ణాలతో పసిడి ధమాకా!
ఈ వార్తాకథనం ఏంటి
భారత కామన్వెల్త్ క్రీడల చరిత్రలో జూడో కొత్త స్వర్ణ అధ్యాయాన్ని లిఖించింది. ఇప్పటివరకు ఈ క్రీడలో ఒక్క స్వర్ణ పతకం కూడా లేని భారత్.. ఈసారి ఒకే రోజులో రెండు బంగారు పతకాలు గెలిచి చరిత్ర సృష్టించింది. అస్మిత డే కామన్వెల్త్ క్రీడల్లో జూడోలో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళా జూడోకాగా రికార్డు సృష్టించగా, కొద్దిసేపటికే హర్ష్ సింగ్ పురుషుల విభాగంలో మరో స్వర్ణం అందించి భారత ఖాతాలో రెండో బంగారు పతకాన్ని జత చేశాడు. మరోవైపు యామిని మౌర్య స్వర్ణానికి చేరువగా వెళ్లినా త్రుటిలో అవకాశాన్ని కోల్పోయి రజత పతకంతో సరిపెట్టుకుంది.
వివరాలు
అస్మిత డే చరిత్ర సృష్టించిన పసిడి
మహిళల 48 కేజీల విభాగంలో 23 ఏళ్ల అస్మిత డే అద్భుత పోరాటంతో విజేతగా నిలిచి, కామన్వెల్త్ జూడోలో భారత తొలి స్వర్ణాన్ని సాధించింది.
ఫైనల్లో కెనడాకు చెందిన హైది కువాచ్‌తో జరిగిన హోరాహోరీ పోరులో ఆరంభంలో వెనుకబడిన అస్మిత, అనంతరం పుంజుకుని స్కోరును 1-1తో సమం చేసింది.
నిర్ణీత నాలుగు నిమిషాల వ్యవధిలో విజేత తేలకపోవడంతో మ్యాచ్ 'గోల్డెన్ స్కోర్'కు వెళ్లింది.
ఈ దశలో ముందుగా పాయింట్ సాధించిన వారే విజేతగా నిలిచే నిబంధన ఉండగా, అస్మిత దూకుడుగా ఆడి ప్రత్యర్థిపై పైచేయి సాధించి చారిత్రాత్మక స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.
వివరాలు
హర్ష్ సింగ్ నుంచి మరో స్వర్ణం
పురుషుల 60 కేజీల విభాగంలో 23 ఏళ్ల హర్ష్ సింగ్ భారత్‌కు రెండో స్వర్ణ పతకాన్ని అందించాడు.
ఫైనల్లో ఆస్ట్రేలియాకు చెందిన అనుభవజ్ఞుడు, ఫేవరెట్‌గా బరిలోకి దిగిన జాషువా కట్జ్‌ను ఓడించి సంచలనం సృష్టించాడు. ఆ పోరు చివరి వరకు హోరాహోరీగా సాగింది.
ఇద్దరు జూడోకాలు సమాన స్థాయిలో పోరాడడంతో మ్యాచ్ 'గోల్డెన్ స్కోర్'కు వెళ్లేలా కనిపించింది.
అయితే పోటీ ముగియడానికి మరో 41 సెకన్లు మాత్రమే మిగిలి ఉండగా హర్ష్ 'వాజా-అరి' టెక్నిక్‌తో కీలక ఆధిక్యం సాధించాడు. అనంతరం ప్రత్యర్థిని తెలివిగా నిలువరించి స్వర్ణ పతకాన్ని ఖాయం చేసుకున్నాడు.
వివరాలు
యామినికి త్రుటిలో చేజారిన స్వర్ణం
మహిళల 57 కేజీల విభాగంలో యామిని మౌర్య అద్భుతంగా పోరాడినా స్వర్ణాన్ని అందుకోలేక రజత పతకంతో సరిపెట్టుకుంది.
ఇంగ్లాండ్‌కు చెందిన అసెల్యా టోప్రక్‌తో జరిగిన ఫైనల్ బౌట్‌లో నిర్ణీత సమయంలో ఇరువురూ ఒక్క పాయింట్ కూడా సాధించలేకపోయారు.
దీంతో పోటీ 'గోల్డెన్ స్కోర్'లోకి వెళ్లింది. అక్కడ కూడా మూడు నిమిషాల పాటు ఎవరూ ఆధిక్యంలోకి వెళ్లలేదు.
అయితే యామిని చేసిన చిన్న తప్పిదానికి పెనాల్టీ విధించడంతో టోప్రక్‌కు స్వర్ణ పతకం దక్కింది.
గ్లాస్గో కామన్వెల్త్ క్రీడలకు ముందు వరకు జూడోలో భారత్ ఖాతాలో 5 రజతాలు, 6 కాంస్య పతకాలు మాత్రమే ఉండగా, ఇప్పుడు తొలిసారిగా రెండు స్వర్ణాలు జతకావడం విశేషంగా నిలిచింది.
వివరాలు
డిస్కస్ త్రోలో సీమకు కాంస్యం
డిస్కస్ త్రోలో భారత అథ్లెట్ సీమ కలీరామ్ కూడా తన ప్రతిభను చాటుకుంది. గురువారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో ఆమె 58.65 మీటర్ల దూరం డిస్కస్‌ను విసిరి కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
మూడో ప్రయత్నంలో ఈ దూరాన్ని నమోదు చేసిన సీమ, తర్వాతి ప్రయత్నాల్లో దానిని మెరుగుపరచేందుకు ప్రయత్నించినా విజయవంతం కాలేకపోయింది.
భారత్‌కు చెందిన మరో అథ్లెట్ నిధి రాణి 57.10 మీటర్ల త్రోతో నాలుగో స్థానంలో నిలిచింది.
జమైకాకు చెందిన సమంత హాల్ 61.66 మీటర్ల త్రోతో స్వర్ణం సాధించగా, కెనడాకు చెందిన జూలియా టంక్స్ 60.67 మీటర్లతో రజత పతకాన్ని దక్కించుకుంది.