Loading...
JPN vs IND: జపాన్‌తో చారిత్రక మ్యాచ్‌.. 2 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం
జపాన్‌తో చారిత్రక మ్యాచ్‌.. 2 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం

JPN vs IND: జపాన్‌తో చారిత్రక మ్యాచ్‌.. 2 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 22, 2026
02:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకమే లక్ష్యంగా బరిలోకి దిగబోతున్న భారత జట్టు.. మొదటి మ్యాచులో విజయం సాధించి సత్తా చాటింది. ఆసియా క్రీడలకు ఆతిథ్యమిస్తున్న జపాన్‌తో జరిగిన చారిత్రక తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను ఐదు ఓవర్లకు కుదించగా.. జపాన్‌పై టీమ్‌ఇండియా రెండు పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే ఐదు ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి 32 పరుగులు మాత్రమే చేసింది. భారత ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ మరోసారి డకౌట్‌గా వెనుదిరిగాడు. సంజూ శాంసన్‌ 9, ఇషాన్‌ కిషన్‌ 3 పరుగులతో నిరాశపరిచారు. శ్రేయస్‌ అయ్యర్‌ 16 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.

వివరాలు

లక్ష్య ఛేదనలో జపాన్‌ పోరాటం

జపాన్‌ బౌలర్లలో ఛార్లీ హరా-హింజే రెండు వికెట్లు పడగొట్టగా.. ఇబ్రహిం తకహషీ, బెంజమిన్‌ ఇతో-డేవిస్‌ చెరో వికెట్‌ తీశారు.

33 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన జపాన్‌.. భారత జట్టుకు గట్టి పోటీ ఇచ్చింది. అయితే నిర్ణీత ఐదు ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 30 పరుగులకే పరిమితమైంది.

దీంతో భారత్‌ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. జపాన్‌ బ్యాటర్లలో కెండెల్‌ కడోవాకి-ఫ్లెమింగ్‌ 12 పరుగులు, జెంజిమిన్‌ ఇతో డేవిస్‌ 9 పరుగులతో ఫర్వాలేదనిపించారు.

భారత బౌలర్లలో వాషింగ్టన్‌ సుందర్‌ రెండు వికెట్లు తీశాడు. జపాన్‌ ఓపెనర్‌ లచ్లాన్‌ యమమోటో లేక్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు.

వివరాలు

అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌కు 200వ విజయం

ఈ గెలుపుతో అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌ 200వ విజయాన్ని నమోదు చేసింది.

2006లో దక్షిణాఫ్రికాపై తొలి విజయాన్ని అందుకున్న టీమ్‌ఇండియా.. 2017లో శ్రీలంకపై 50వ విజయాన్ని సాధించింది.

ఆ తర్వాత వెస్టిండీస్‌పై 2022లో 100వ విజయాన్ని, ఆస్ట్రేలియాపై 2024లో 150వ విజయాన్ని నమోదు చేసింది.

ADVERTISEMENT

వివరాలు

అతి స్వల్ప తేడాతో గెలిచిన మ్యాచ్‌ల్లో ఇదీ ఒకటి

భారత్‌ అత్యంత తక్కువ మార్జిన్‌తో గెలిచిన మ్యాచ్‌ల్లో జపాన్‌పై సాధించిన ఈ విజయం కూడా ఒకటిగా నిలిచింది.

2012లో దక్షిణాఫ్రికాపై, 2016లో బంగ్లాదేశ్‌పై టీమ్‌ఇండియా ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది.

ఇక 2023లో శ్రీలంకపై రెండు పరుగుల తేడాతో గెలిచింది. ఇప్పుడు జపాన్‌పై కూడా రెండు పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించింది.

ADVERTISEMENT

వివరాలు

20 శాశ్వత సభ్య దేశాల్లో 17 సార్లు విజయమే

ఐసీసీ శాశ్వత సభ్య దేశాల్లో భారత్‌ ఇప్పటివరకు 20 దేశాలతో తొలి టీ20 మ్యాచ్‌లు ఆడింది. వీటిలో 17 సార్లు టీమ్‌ఇండియా విజయం సాధించింది.

న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌పై భారత్‌ ఓటమిపాలైంది. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఫలితం తేలలేదు.

జపాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు.

వివరాలు

అభిషేక్‌ శర్మ ఖాతాలో చెత్త రికార్డులు

గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగిన అతడు అంతర్జాతీయ టీ20ల్లో ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పొట్టి ఫార్మాట్‌లో అత్యధికసార్లు గోల్డెన్‌ డక్‌గా ఔటైన భారత ఓపెనర్‌గా అభిషేక్‌ శర్మ నిలిచాడు.

ఇప్పటివరకు రోహిత్‌ శర్మ అంతర్జాతీయ టీ20ల్లో నాలుగు సార్లు గోల్డెన్‌ డక్‌గా ఔటవ్వగా.. అభిషేక్‌ శర్మ ఐదు సార్లు ఇలా పెవిలియన్‌కు చేరాడు.

అంతేకాకుండా ఒక క్యాలెండర్‌ ఏడాదిలో టీ20ల్లో అత్యధికసార్లు డకౌట్‌ అయిన బ్యాటర్‌గానూ అభిషేక్‌ శర్మ మరో చెత్త రికార్డును నమోదు చేశాడు.

2026లో ఇప్పటివరకు అతడు 10 సార్లు డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ జాబితాలో 2019లో 9 డకౌట్లతో రషీద్‌ ఖాన్‌, 2024లో 9 డకౌట్లతో షాదాబ్‌ ఖాన్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ADVERTISEMENT