Smriti Mandhana : టీ20 క్రికెట్లో చరిత్ర.. తొలి భారత బ్యాటర్‌గా స్మృతి మంధాన రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
భారత మహిళల క్రికెట్ జట్టు మరోసారి తమ సత్తా చాటింది. వన్డే ప్రపంచకప్ విజయం సాధించిన తరువాత నెల రోజుల విరామం అనంతరం మైదానంలోకి దిగిన టీమిండియా మహిళలు అద్భుత ప్రదర్శనతో అభిమానులను అలరించారు. ఈ క్రమంలో భారత మహిళా జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన సరికొత్త చరిత్ర సృష్టించింది. శ్రీలంకతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా విశాఖపట్టణం వేదికగా ఆదివారం తొలి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు బౌలింగ్, బ్యాటింగ్ రెండింట్లోనూ పూర్తిస్థాయిలో ఆధిపత్యం చూపింది. ఫలితంగా స్వల్ప లక్ష్యాన్ని 32 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి, ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది.
Details
శ్రీలంక ఇన్నింగ్స్
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక మహిళల జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 121 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లు కట్టుదిట్టమైన ప్రదర్శనతో లంక బ్యాటర్లను కట్టడి చేశారు. భారత్ చేజ్‌లో ఊపు స్వల్ప లక్ష్య ఛేదనలో భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్లో రెండు ఫోర్లు బాదిన షఫాలీ వర్మ (9) మరుసటి ఓవర్‌లో ఔట్ అయింది. ఆ తర్వాత స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ ఇన్నింగ్స్‌ను అజేయంగా ముందుకు నడిపించారు. వీరిద్దరి భాగస్వామ్యంతో భారత్ విజయాన్ని సులభంగా అందుకుంది.
Details
స్మృతి మంధాన చరిత్ర
ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన మహిళల టీ20 క్రికెట్‌లో 4,000పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. అంతేకాదు, మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్‌గా నిలిచింది. స్మృతికి ముందు ఈ రికార్డును న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ సుజీ బేట్స్ సాధించారు. సుజీ బేట్స్ ఇప్పటివరకు 177 మ్యాచ్‌లలో 4,716పరుగులు చేశారు. ప్రస్తుతం స్మృతి మంధాన 154మ్యాచ్‌ల్లో 4,007 పరుగులు పూర్తి చేసింది. ఇక ఈ జాబితాలో మూడో స్థానంలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఉంది. ఆమె 183 మ్యాచ్‌లలో 3,669 పరుగులు సాధించింది. ఈ విజయంతో పాటు స్మృతి మంధాన రికార్డు భారత మహిళల క్రికెట్‌కు మరింత ఊపునిచ్చిందని క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు.