Major Dhyan Chand Khel Ratna: క్రీడల్లో అత్యున్నత అవార్డు ఖేల్‌రత్న ఎప్పుడు ప్రారంభమైంది? ఎందుకు పేరు మార్చారు?
మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న భారతదేశంలో ఇచ్చే అతిపెద్ద క్రీడా పురస్కారం. ఇంతకుముందు ఈ అవార్డు పేరు 'రాజీవ్ గాంధీ ఖేల్ రత్న', ఇప్పుడు దానిని 'మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న'గా మార్చారు. దేశ క్రీడా చరిత్రలో గొప్ప పేరున్న హాకీ ప్లేయర్, మూడుసార్లు ఒలింపిక్ బంగారు పతకాన్ని గెలుచుకున్న భారత హాకీ జట్టులో సభ్యుడిగా ఉన్నమేజర్ ధ్యాన్ చంద్ పేరు మీద ఈ అవార్డుకు పేరు పెట్టారు. క్రీడలు,యువజన మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ఈ అవార్డును అందజేస్తుంది. గ్రహీతలను మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ ఎంపిక చేస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో గత నాలుగు సంవత్సరాల కాలంలో క్రీడా రంగంలో వారి అద్భుతమైన, అత్యుత్తమ ప్రదర్శనకు అవార్డు ఇవ్వబడుతుంది.
అవార్డులో అవార్డు గ్రహీతకు ఏమి ఇస్తారు
ఈ అవార్డులో, అవార్డు గ్రహీతకు పతకం, ప్రశంసా పత్రం, నగదు అందజేస్తారు. 2018లో ఈ మొత్తం రూ.7.5 లక్షలు. అయితే ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ.25 లక్షలకు పెంచారు. అంతేకాకుండా గ్రహితకి ఉచిత రైల్వే పాస్ సౌకర్యం అందిస్తారు. దీని కింద మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గ్రహీతలు రాజధాని లేదా శతాబ్ది రైళ్లలో మొదటి , రెండవ తరగతి ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లలో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఖేల్ రత్న 1991-1992లో ప్రారంభమైంది. అంతకుముందు ప్రతీ ఏడాది ఒకే అవార్డు ఇచ్చేవారు. 2014లో అవార్డుల ఎంపిక కమిటీ సూచనల ఆధారంగా, 2015లో నాలుగేళ్ల ప్రదర్శన ఆధారంగా క్రీడా మంత్రిత్వ శాఖ అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది.
రాజీవ్ ఖేల్ రత్న అవార్డును మేజర్ ధ్యాన్ చంద్ ఖలే రత్నగా మారుస్తూ నిర్ణయం
మొట్ట మొదటి ఖేల్ రత్న అవార్డు చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు ప్రధానం చేశారు. టోక్యో ఒలింపిక్స్‌లో హాకీ పురుషుల జట్టు 41 ఏళ్ల తర్వాత పతకం గెలవడం. అనుభవం లేని మహిళా హాకీ జట్టు అద్భుతంగా రాణించడంతో మేజర్ ధ్యాన్ చంద్ పేరుతో ఖేల్ రత్న ఇవ్వాలని సోషల్ మీడియాలో ట్రెండింగ్ నడిచింది. అంతే కాకుండా పలు వర్గాల నుంచి కూడా భారత హాకీ పితామహుడిగా పిలిచే ధ్యాన్‌చంద్ పేరుతో అవార్డు ఇవ్వాలని డిమాండ్ వచ్చింది. అన్నింటినీ పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం రాజీవ్ ఖేల్ రత్న అవార్డును మేజర్ ధ్యాన్ చంద్ ఖలే రత్నగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నది.