Hockey India: హాకీ జెర్సీ వివాదం.. వివరణ ఇవ్వాలంటూ అధికారులకు దిలీప్ టిర్కీ ఆదేశాలు!
ఈ వార్తాకథనం ఏంటి
భారత పురుష, మహిళా హకీ జట్ల జెర్సీ రంగు మార్పు అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయ హాకీలో ఉపయోగించే సింథటిక్ పిచ్‌లు నీలి రంగులో ఉండటంతో, అదే రంగులో జెర్సీలు ఉంటే ఆటగాళ్లను గుర్తించడం కష్టమవుతోందని, అందుకే జాతీయ జెండాలో భాగమైన కాషాయ రంగును ఎంపిక చేశామని హాకీ ఇండియా ఇటీవల వెల్లడించింది. అయితే ఈ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తాయి. జెర్సీ రంగు మార్పును నిన్న సమర్థించిన హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ, తాజాగా ఈ నిర్ణయంపై పూర్తి వివరణ ఇవ్వాలని అధికారులను ఈ-మెయిల్ ద్వారా ఆదేశించడం జాతీయ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
వివరాలు
ఎగ్జిక్యూటివ్ బోర్డుకు తెలియకుండా నిర్ణయం?
దిలీప్ టిర్కీ తన ఈ-మెయిల్‌లో కీలక అంశాలను ప్రస్తావించారు.
భారత జట్టు జెర్సీ రంగు మార్పు అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎగ్జిక్యూటివ్ బోర్డు ముందు చర్చకు తీసుకురాకుండా, నాకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఈ నిర్ణయం తీసుకుని అమలు చేశారు.
అయితే కాషాయ రంగును ఎంపిక చేయడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు. రంగుపై నాకు అభ్యంతరం లేదు.
కానీ ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకునే ముందు పాలక మండలి, కార్యనిర్వాహక మండలితో చర్చించి ఉండాల్సింది.
వివరాలు
రాజకీయ వ్యాఖ్యలపై ఆందోళన
జెర్సీ రంగు మార్పు నేపథ్యంలో రాజకీయ వ్యాఖ్యలు కూడా వినిపించాయని టిర్కీ పేర్కొన్నారు. జెర్సీ రంగు మార్పుపై దురదృష్టవశాత్తూ రాజకీయపరమైన వ్యాఖ్యలు వచ్చాయి.
ప్రపంచకప్, ఆసియా కప్ వంటి కీలక టోర్నీలు సమీపిస్తున్న వేళ మన దృష్టి పూర్తిగా జట్టు ఎంపిక, సన్నాహాలపైనే ఉండాలి.
అందుకే ఇది పూర్తిగా క్రీడాపరమైన నిర్ణయమని నేను బహిరంగంగా చెప్పాను.
వివరాలు
ఒడిశా ప్రభుత్వం వివరణ కోరింది
ఈ అంశంపై ఒడిశా ప్రభుత్వం కూడా వివరణ కోరినట్లు టిర్కీ వెల్లడించారు.
ఈ నిర్ణయానికి గల కారణాలు, ప్రాతిపదిక, అనుసరించిన విధానం, దీనికి దారితీసిన పరిస్థితులపై పూర్తి లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించాను.
ఆ వివరాలు వచ్చిన తర్వాతనే నేను కూడా కచ్చితమైన సమాచారం అందించగలను అని పేర్కొన్నారు.
అంతకుముందు టిర్కీ ఏమన్నారంటే?
జెర్సీ రంగు మార్పుపై వచ్చిన విమర్శలకు స్పందిస్తూ దిలీప్ టిర్కీ గతంలోనే వివరణ ఇచ్చారు. టీమిండియా జెర్సీ రంగుపై అనేక వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
కొందరు రాజకీయ కోణంలో చూస్తున్నారు. కానీ జెర్సీ రంగును ఇప్పుడు మాత్రమే కాదు.. 2014, 2018 సంవత్సరాల్లో కూడా మార్చాం. నేను కూడా ఆ జెర్సీలతోనే ఆడానని చెప్పారు.
వివరాలు
మాజీ ఆటగాళ్లలో భిన్నాభిప్రాయాలు
జెర్సీ రంగు మార్పుపై మాజీ భారత గోల్‌కీపర్ 'పీఆర్ శ్రీజేశ్' హాకీ ఇండియా నిర్ణయానికి మద్దతు తెలిపారు.
అయితే మాజీ కెప్టెన్ విరెన్ రస్క్వినా మాత్రం ఈ మార్పును వ్యతిరేకిస్తూ, జెర్సీ రంగు మార్చాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
ఇలా భారత హాకీ జట్టు కొత్త జెర్సీ చుట్టూ నెలకొన్న వివాదం మరింత ముదురుతుండగా, హాకీ ఇండియా నుంచి వచ్చే అధికారిక వివరణపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.