IND vs SA: 17 ఏళ్ల తర్వాత టైటిల్.. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలిచిన తీరు ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
11 ఏళ్ల ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు తెరదిస్తూ భారత జట్టు టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. జూన్ 29, 2024న బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నారు. మార్పులు లేకుండా ఇరు జట్లు తుదిజట్టుతో బరిలోకి దిగాయి. ఓపెనర్లు రోహిత్, విరాట్ కోహ్లీ మంచి ఆరంభం ఇచ్చారు. ఈ క్రమంలోకేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో రోహిత్ (9) ఔటయ్యాడు. వెంటనే రిషబ్ పంత్ (0), సూర్యకుమార్ యాదవ్ (3) వికెట్లు కోల్పోయి భారత్ 34/3తో కష్టాల్లో పడింది.
వివరాలు
కోహ్లీ కీలక భాగస్వామ్యాలు
అయితే కోహ్లీ (76) అక్షర్ పటేల్ (47),శివమ్ దూబే (27)లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి 20 ఓవర్లలో భారత్‌ను 176/7కు చేర్చాడు. లక్ష్య ఛేదనలో జస్ప్రీత్ బుమ్రా రీజా హెండ్రిక్స్ (4)ను ఔట్ చేసి ఆరంభంలోనే బ్రేక్ ఇచ్చాడు. అర్ష్‌దీప్ సింగ్ అద్భుత బౌలింగ్‌తో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్రం (4)ను ఔట్ చేసి సఫారీలను 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయేలా చేశాడు. ఆపై క్వింటన్ డి కాక్ (39), ట్రిస్టన్ స్టబ్‌స్ (31) 58 పరుగుల భాగస్వామ్యంతో మ్యాచ్‌ను మళ్లీ సఫారీల వైపు తిప్పారు. అక్షర్ పటేల్ స్టబ్‌స్ వికెట్ తీసి ఆ జోడిని విడదీశాడు. తరువాత అర్ష్‌దీప్ డి కాక్‌ను ఔట్ చేశాడు.
వివరాలు
హైన్రిచ్ క్లాసెన్ అవుట్ తో చిగురించిన ఆశలు
ఐదో స్థానంలో వచ్చిన హైన్రిచ్ క్లాసెన్ (52) అర్ధశతకంతో మ్యాచ్‌ను దక్షిణాఫ్రికా వైపు మళ్లించినా, 17వ ఓవర్లో హార్దిక్ పాండ్యా అతన్ని ఔట్ చేసి భారత్‌కు ఊపిరి పోశాడు. మరో ఎండ్‌లో బుమ్రా మార్కో జాన్సన్ (2) వికెట్ తీసి ఒత్తిడి పెంచాడు. చివరి ఓవర్లో 16 పరుగులు అవసరమైన సమయంలో పాండ్యా బౌలింగ్‌లో డేవిడ్ మిల్లర్ (21) భారీ షాట్ ఆడగా,సూర్యకుమార్ యాదవ్ అద్భుత క్యాచ్ పట్టి మ్యాచ్ మలుపు తిప్పాడు. చివరికి పాండ్యా చాకచక్యంగా బౌలింగ్ చేసి భారత్‌కు రెండో టి20 వరల్డ్ కప్ టైటిల్ అందించాడు. ఈ విజయంలో కీలకమైన ఐదు మలుపులు ఇలా ఉన్నాయి. జస్ప్రీత్ బుమ్రా వేసిన కీలక స్పెల్ మ్యాచ్‌ను భారత్ వైపు మళ్లించింది.
వివరాలు
17 ఏళ్ల తర్వాత మరోసారి టి20 ప్రపంచకప్
30 బంతుల్లో 30 పరుగులు అవసరమైన సమయంలో 16వ ఓవర్లో కేవలం 4పరుగులే ఇచ్చి,18వఓవర్లో 2 పరుగులే ఇచ్చి జాన్సన్ వికెట్ సాధించాడు.అతని గణాంకాలు 4-0-18-2గా నిలిచాయి. సూర్యకుమార్ యాదవ్ పట్టిన అద్భుత క్యాచ్ మ్యాచ్‌ను భారత్ చేతుల్లోకి తెచ్చింది. అక్షర్ పటేల్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో 47పరుగులు చేసి,స్టబ్‌స్ వికెట్ తీసి కీలక పాత్ర పోషించాడు. విరాట్ కోహ్లీ 59బంతుల్లో 76పరుగులతో జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో ప్రధాన పాత్ర వహించాడు. ఇక హార్దిక్ పాండ్యా 3ఓవర్లలో 20 పరుగులకే 3 వికెట్లు తీసి క్లాసెన్,మిల్లర్,రబాడా వికెట్లు సాధించి విజయానికి బలమైన పునాది వేశాడు. ఈ విధంగా ఉత్కంఠభరిత పోరులో భారత్ 17 ఏళ్ల తర్వాత మరోసారి టి20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.