Vaibhav suryavamsi: ఆర్‌ఆర్‌కు ప్లేఆఫ్స్ ఆశలు నిలబెట్టిన వైభవ్ సూర్యవంశీ
ఈ వార్తాకథనం ఏంటి
హ్యాట్రిక్ ఓటములతో ప్లేఆఫ్స్ ఆశలను క్లిష్టం చేసుకున్న రాజస్థాన్ రాయల్స్ ఎట్టకేలకు లక్నోపై అద్భుత విజయంతో మళ్లీ రేసులోకి వచ్చింది. ఈ మ్యాచ్‌లో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ తన దూకుడు బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. మ్యాచ్‌కు ముందు జట్టు ప్రధాన కోచ్ కుమార సంగక్కర తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని, అయితే తాను మాత్రం పూర్తి నమ్మకంతో ఉండి జట్టును గెలిపిస్తానని కోచ్‌కు భరోసా ఇచ్చానని వైభవ్ తాజాగా వెల్లడించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అతడు చూపించిన ఆత్మవిశ్వాసం, పరిణతి ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
వివరాలు
కోచ్‌కి అదే చెప్పిన వైభవ్..
ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో వైభవ్ సూర్యవంశీ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు అతడు 579 పరుగులు సాధించాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ తమ చివరి లీగ్ మ్యాచ్‌ను మే 24న ముంబయితో ఆడనుంది. ఈ సందర్భంగా వైభవ్ మాట్లాడుతూ.. ''ముందు మూడు మ్యాచ్‌ల్లో మా జట్టుకు అనుకూల ఫలితాలు రాలేదు. లక్నోతో మ్యాచ్‌లో కూడా మాకు భారీ లక్ష్యమే ఎదురైంది. నేను ప్యాడ్లు కట్టుకుని సిద్ధమవుతుండగా మా కోచ్ కుమార సంగక్కరను చూశా. ఆయన చాలా టెన్షన్‌లో కనిపించారు. కానీ నేను మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నా. ఈ మ్యాచ్‌లో బాగా ఆడి జట్టును గెలిపించగలనని నమ్మకం కలిగింది. అదే విషయాన్ని కోచ్‌కు కూడా చెప్పా.'' అని తెలిపాడు.
వివరాలు
సచిన్ తర్వాత అతనే..
లక్నోపై జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ చెలరేగిపోయాడు. కేవలం 38 బంతుల్లోనే 93 పరుగులు చేసి రాజస్థాన్ విజయానికి ప్రధాన కారణంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, 10 భారీ సిక్స్‌లు ఉన్నాయి. వైభవ్ ధాటికి రాజస్థాన్ రాయల్స్ ఏడు వికెట్ల తేడాతో సునాయాస విజయం సాధించింది. ఇక మాజీ భారత క్రికెటర్ కిరణ్ మోరె కూడా వైభవ్ ఆటతీరుపై ప్రశంసలు కురిపించారు. ''సచిన్ తెందూల్కర్ భారత జట్టులోకి వచ్చినప్పుడు ప్రపంచ స్థాయి బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీని చూస్తుంటే యువ సచిన్ గుర్తుకొస్తున్నాడు. క్రికెట్ కోసమే దేవుడు అతడిని తయారుచేసినట్టుంది. ప్రస్తుతం అతడు ఎలా ఆడుతున్నాడో అలాగే కొనసాగనివ్వాలి'' అని కిరణ్ మోరె అభిప్రాయపడ్డారు.