Loading...
FIFA World Cup: ఫిఫా ఫైనల్‌కు ముందు స్పెయిన్‌కు భారీ షాక్.. స్టార్ ప్లేయర్‌కి గాయం!
ఫిఫా ఫైనల్‌కు ముందు స్పెయిన్‌కు భారీ షాక్.. స్టార్ ప్లేయర్‌కి గాయం!

FIFA World Cup: ఫిఫా ఫైనల్‌కు ముందు స్పెయిన్‌కు భారీ షాక్.. స్టార్ ప్లేయర్‌కి గాయం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 17, 2026
12:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫిఫా ప్రపంచకప్‌-2026 తుది అంకానికి చేరుకుంది. ఆదివారం జరగనున్న ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, స్పెయిన్‌తో తలపడనుంది. 16 ఏళ్ల తర్వాత మరోసారి ప్రపంచకప్‌ను గెలుచుకోవాలని ఆశిస్తున్న స్పెయిన్‌కు ఫైనల్‌కు ముందు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్టార్ ఆటగాడు లామిన్ యమాల్ తొడ కండరాల గాయంతో బాధపడుతున్నట్లు సమాచారం. స్పెయిన్ ప్రాక్టీస్ సెషన్‌లో యమాల్ ఎడమ తొడకు భారీ బ్యాండేజ్ కట్టుకుని కనిపించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అలాగే తొడ నొప్పికి ఫిజియో చికిత్స పొందుతున్న వీడియో కూడా బయటకు వచ్చింది. గాయం కారణంగా అతను జట్టు ప్రాక్టీస్‌లో పాల్గొనకపోవడం స్పెయిన్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.

వివరాలు

సెమీఫైనల్‌ మ్యాచులో గాయం

ఫ్రాన్స్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో 22వ నిమిషంలో లుకాస్ డిగ్నే పెనాల్టీ బాక్స్ వద్ద యమాల్‌ను కిందపడేయడంతో అతని ఎడమ తొడకు గాయం అయినట్లు తెలుస్తోంది.

అయినప్పటికీ నొప్పిని లెక్కచేయకుండా యమాల్ మ్యాచ్ మొత్తం ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత జట్టు హోటల్‌కు చేరుకున్నాక గాయం తీవ్రత పెరిగినట్లు సమాచారం.

దీంతో స్పెయిన్ బస చేస్తున్న డల్లాస్ హోటల్‌కే వైద్య బృందాన్ని పిలిపించి ప్రత్యేక చికిత్స అందించారు. అనంతరం అతని ఎడమ తొడకు పెద్ద బ్యాండేజ్ కట్టినట్లు తెలుస్తోంది.

వివరాలు

ఫైనల్ ఆడతాడా?

తొడ గాయం కారణంగా ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్న యమాల్ ఆదివారం అర్జెంటీనాతో జరిగే ప్రతిష్ఠాత్మక ఫైనల్‌లో బరిలోకి దిగుతాడా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

జట్టు వైద్యులు అతని ఫిట్‌నెస్‌ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు సమాచారం. 19 ఏళ్ల లామిన్ యమాల్ ఈ ప్రపంచకప్‌లో స్పెయిన్‌కు కీలక ఆటగాడిగా నిలిచాడు.

ఏడు మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క గోల్ చేసినప్పటికీ, అతని సృజనాత్మక ఆటతీరు, దాడుల్లో చూపించే ప్రభావం జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించింది.

ఈ నేపథ్యంలో ఫైనల్‌కు ముందు అతని ఫిట్‌నెస్ స్పెయిన్‌కు అత్యంత కీలకంగా మారింది.

ADVERTISEMENT