LOADING...
Ben Stokes : స్టోక్స్, అట్కిన్సన్‌కు భారీ ఊరట.. నైట్‌క్లబ్ వివాదంలో ఈసీబీ క్లీన్‌చిట్!
స్టోక్స్, అట్కిన్సన్‌కు భారీ ఊరట.. నైట్‌క్లబ్ వివాదంలో ఈసీబీ క్లీన్‌చిట్!

Ben Stokes : స్టోక్స్, అట్కిన్సన్‌కు భారీ ఊరట.. నైట్‌క్లబ్ వివాదంలో ఈసీబీ క్లీన్‌చిట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 23, 2026
11:02 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, యువ పేసర్ గస్ అట్కిన్సన్‌కు నైట్‌క్లబ్ వివాదంలో భారీ ఊరట లభించింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టిన ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తుది నిర్ణయాన్ని ప్రకటిస్తూ, ఇద్దరు ఆటగాళ్లపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇంగ్లండ్-న్యూజిలాండ్ తొలి టెస్టు ముగిసిన అనంతరం స్టోక్స్, అట్కిన్సన్ ఓ నైట్‌క్లబ్‌లో కనిపించారు. అదే సమయంలో ప్రీమియర్‌షిప్ రగ్బీ క్లబ్ సారసెన్స్‌కు చెందిన ఓ ఆటగాడు జట్టు భద్రతా సిబ్బందిలో ఒకరిపై దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన వివాదానికి దారితీయడంతో స్టోక్స్, అట్కిన్సన్ పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి.

వివరాలు

నిబంధనలను ఉల్లంఘించలేదు

అయితే ఈ వ్యవహారాన్ని పరిశీలించిన ఇండిపెండెంట్ క్రికెట్ రెగ్యులేటర్ అందుబాటులో ఉన్న అన్ని ఆధారాలు, వివరాలను సమగ్రంగా సమీక్షించింది. అనంతరం ఇద్దరు ఆటగాళ్లు ఎలాంటి నిబంధనల ఉల్లంఘనకు పాల్పడలేదని తేల్చింది. అందుబాటులో ఉన్న సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలించినప్పటికీ, రెగ్యులేటరీ ఉల్లంఘన జరిగిందని నిర్ధారించే ఎలాంటి ఆధారాలు లభించలేదని తన ప్రకటనలో పేర్కొంది. దీంతో బెన్ స్టోక్స్, గస్ అట్కిన్సన్‌ల కెరీర్‌పై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. ముఖ్యంగా గాయాల నుంచి కోలుకుని ఇటీవలే జట్టులోకి తిరిగి వచ్చిన స్టోక్స్‌కు ఈ నిర్ణయం మరింత ఊరటనిచ్చింది.

వివరాలు

జూన్ 25న చివరి టెస్టు

ఇక ఇంగ్లండ్-న్యూజిలాండ్ టెస్టు సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా కొనసాగుతోంది. లార్డ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 115 పరుగుల తేడాతో విజయం సాధించగా, ది ఓవల్‌లో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ 200 పరుగులకు పైగా భారీ తేడాతో గెలిచి సిరీస్‌ను సమం చేసింది. ఇప్పుడు సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే చివరి టెస్టు జూన్ 25 నుంచి నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో జరగనుంది. సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి. బెన్ స్టోక్స్ అందుబాటులో ఉండటం ఇంగ్లండ్‌కు అదనపు బలాన్ని ఇవ్వనుండగా, న్యూజిలాండ్‌కు మాత్రం మరో కీలక సవాల్‌గా మారనుంది.

Advertisement