Loading...
Smriti Mandhana: టీమిండియా కెప్టెన్సీకి నేను సిద్ధం.. స్మృతి మంధాన కీలక వ్యాఖ్యలు!
టీమిండియా కెప్టెన్సీకి నేను సిద్ధం.. స్మృతి మంధాన కీలక వ్యాఖ్యలు!

Smriti Mandhana: టీమిండియా కెప్టెన్సీకి నేను సిద్ధం.. స్మృతి మంధాన కీలక వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 15, 2026
05:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత మహిళల క్రికెట్ జట్టుకు వన్డే ప్రపంచకప్‌ విజయాన్ని అందించిన కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నాయకత్వం ప్రశంసలు అందుకుంటున్నప్పటికీ, ఆ విజయానికి వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన చేసిన కీలక పాత్రను కూడా క్రికెట్‌ వర్గాలు గుర్తిస్తున్నాయి. అయితే గత టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు గ్రూప్‌ దశకే పరిమితమవడంతో జట్టులో నాయకత్వ మార్పులపై చర్చలు మళ్లీ మొదలయ్యాయి. ఇటీవల లార్డ్స్‌ వేదికగా జరిగిన తొలి మహిళల టెస్టులో ఇంగ్లాండ్‌పై భారత్‌ చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్ధ సెంచరీలు నమోదు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.

వివరాలు

హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ వీడ్కోలు పలికే అవకాశం

ఈ నేపథ్యంలో 37 ఏళ్ల హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ త్వరలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.

దీంతో భారత మహిళల జట్టు తదుపరి కెప్టెన్‌ రేసులో స్మృతి మంధాన పేరు బలంగా వినిపిస్తోంది. ఈ అంశంపై స్పందించిన స్మృతి మంధాన.. "అవును.. పూర్తిస్థాయి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించేందుకు నేను సిద్ధంగానే ఉన్నానని స్పష్టం చేసింది.

పదేళ్లుగా హర్మన్‌ప్రీత్‌తో కలిసి భారత జట్టుకు కీలక ఆటగాళ్లలో ఒకరిగా కొనసాగుతున్న మంధాన.. తన దూకుడైన ఓపెనింగ్‌ బ్యాటింగ్‌తో ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించింది.

హర్మన్‌ప్రీత్‌ అందుబాటులో లేని సమయంలో ఇప్పటికే 18 టీ20లు, నాలుగు వన్డేల్లో భారత జట్టుకు సారథ్యం వహించింది

వివరాలు

లార్డ్స్‌ విజయం జీవితాంతం గుర్తుండిపోతుంది

లార్డ్స్‌లో సాధించిన చారిత్రాత్మక విజయంపై స్మృతి మంధాన ఆనందం వ్యక్తం చేసింది.

లార్డ్స్‌ వేదికగా జరిగిన తొలి మహిళల టెస్టులో భారత్‌ ఘన విజయం సాధించడం ఎంతో ప్రత్యేకం. ఆ జట్టులో నేను భాగస్వామి కావడం గర్వంగా ఉంది.

జట్టు విజయానికి నా వంతు సహకారం అందించడం మరింత సంతోషాన్నిచ్చింది.

చిన్నప్పటి నుంచి లార్డ్స్‌లో టెస్టు ఆడాలనే కల ఉండేది. ఇప్పుడు అక్కడ గెలిచి చరిత్ర సృష్టించడం జీవితాంతం గుర్తుండిపోయే అనుభవమని ఆమె చెప్పింది.

ADVERTISEMENT