Asian Games 2026: 'నన్ను కావాలనే తప్పించారు'.. వుషు అథ్లెట్ దివ్యాన్షి సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
మరో వారం రోజుల్లో ఆసియా గేమ్స్ (Asian Games 2026) ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన అథ్లెట్లు జపాన్‌కు చేరుకున్నారు. మరికొందరు త్వరలోనే అక్కడికి పయనమవుతారు. భారత్ నుంచి కూడా అథ్లెట్లు ఇప్పటికే బయలుదేరిన సంగతి తెలిసిందే. అయితే చివరి క్షణాల్లో ఆసియా క్రీడల నుంచి తన పేరును తొలగించడంపై 'వుషు' (చైనీస్ మార్షల్ ఆర్ట్స్) అథ్లెట్ దివ్యాన్షి తీవ్ర ఆవేదనకు గురైంది. ఆమె స్థానంలో రోషిబినా దేవీకి అవకాశం కల్పించారు. దీంతో తీవ్ర భావోద్వేగానికి గురైన దివ్యాన్షి సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను పోస్టు చేసింది. తనకు చావే గతి అంటూ అందులో వ్యాఖ్యానించింది.
వివరాలు
కావాలనే గాయపరిచారు
తనను ఉద్దేశపూర్వకంగానే ఆసియా గేమ్స్ జట్టు నుంచి తప్పించారని 18 ఏళ్ల ఈ వుషు అథ్లెట్ ఆరోపించింది.
శిక్షణ సమయంలో రోషిబినా తనను కావాలనే గాయపరిచినట్లు కూడా దివ్యాన్షి పేర్కొంది.
ఈ మేరకు శుక్రవారం తొమ్మిది నిమిషాల నిడివి కలిగిన భావోద్వేగ వీడియోను ఆమె షేర్ చేయగా.. అది నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
''నన్ను 60 కేజీల కేటగిరీ నుంచి తప్పించడం అన్యాయం. సెలక్షన్స్ ట్రయల్స్‌లో రోషిబినాను రెండుసార్లు ఓడించా. జపాన్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నా. భారత జెర్సీ, కిట్ కూడా అందాయి.
వివరాలు
నన్ను గాయం పేరుతో తీసేశారు
దిల్లీ సెండాఫ్ కార్యక్రమంలోనూ పాల్గొన్నా. అయితే శ్రీనగర్ క్యాంపులో భుజానికి గాయమైంది. వైద్యుడి సూచన ప్రకారం టేపింగ్‌తో ఆడేందుకు అనుమతి వచ్చింది.
నా ఎంఆర్‌ఐ రిపోర్ట్ నా కోచ్, ఫెడరేషన్ వద్ద ఉంది. ఇలాంటి సమయంలో నన్ను గాయం పేరుతో తొలగించారు. రోషిబినాను జట్టులోకి తీసుకున్నారు.
ఆమె ఉద్దేశపూర్వకంగానే నన్ను గాయపరిచింది. ఎన్నోసార్లు మానసిక, శారీరక వేధింపులకు గురయ్యా. నాకు జీవించాలనే ఉద్దేశం లేదని దివ్యాన్షి తన వీడియోలో పేర్కొంది.
అనంతరం భవనం టెర్రస్‌పై ఉన్న సమయంలో వీడియోను ముగించింది.
వివరాలు
ఫెడరేషన్ ఇలా.. కోచ్ అలా
వుషు ఫెడరేషన్ మాత్రం దివ్యాన్షిని భుజం గాయం కారణంగానే జట్టు నుంచి తప్పించామని తెలిపింది. మెడికల్ ఎగ్జామినేషన్ సమయంలో ఆ గాయం బయటపడిందని పేర్కొంది.
ఆసియా గేమ్స్‌కు అనుగుణంగా దివ్యాన్షి సరైన శిక్షణ కూడా తీసుకోలేకపోయిందని సంఘం ప్రతినిధులు వెల్లడించారు.
అయితే దివ్యాన్షి కోచ్ అశోక్ గౌతమ్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు.
ఆమెకు అయిన గాయం తీవ్రంగా ఏమీ లేదని, ఆసియా గేమ్స్ నుంచి తప్పించేంత పరిస్థితి లేదని ఆయన వెల్లడించారు.