David Miller: 2027 వరల్డ్ కప్ గెలిచి రిటైర్ అవుతా..! స్టార్ క్రికెటర్ సంచలన ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణాఫ్రికా స్టార్ మిడిల్‌ఆర్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ తన క్రికెట్ కెరీర్‌కు ప్రపంచకప్ విజయంతో ముగింపు పలకాలని బలమైన కోరికను వ్యక్తం చేశాడు. 2027లో స్వదేశంలో జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తరఫున ఆడి.. జట్టుకు ట్రోఫీ అందించడమే తన ప్రధాన లక్ష్యమని వెల్లడించాడు. 2027 అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21 వరకు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా వన్డే ప్రపంచకప్ జరగనుంది. దక్షిణాఫ్రికా ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్‌ను గెలవలేదు. 2023 ప్రపంచకప్‌లో సెమీఫైనల్ వరకు వెళ్లిన ప్రొటీస్ జట్టు.. కోల్‌కతాలో జరిగిన కీలక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో 2027 ప్రపంచకప్ తనకు ఎంతో ప్రత్యేకమైనదని మిల్లర్ పేర్కొన్నాడు.
వివరాలు
ప్రపంచ కప్ ట్రోఫిని ముద్దాడాలి
కెరీర్ చివరి దశలో ఒక ప్రపంచకప్ ట్రోఫీని అందుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.
అయితే 2027 ప్రపంచకప్ సమయానికి జట్టులో తన స్థానం ఇప్పుడే ఖాయమని చెప్పలేమని స్పష్టం చేశాడు. అప్పటివరకు అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ.. జట్టులో తన స్థానాన్ని సంపాదించుకోవడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు.
మిడిల్‌ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తూ క్లిష్ట పరిస్థితుల్లో మ్యాచ్‌లను ముగించడం తన కెరీర్‌లో అత్యంత గర్వకారణమైన అంశమని మిల్లర్ చెప్పాడు.
ముఖ్యంగా లక్ష్య ఛేదనల్లో ఒత్తిడిని ఎదుర్కొంటూ మ్యాచ్‌ను ఫినిష్ చేయడం తనకు ఎంతో ఇష్టమని వెల్లడించాడు. ఈ నైపుణ్యాన్ని సాధించడానికి ఎన్నో సంవత్సరాల అనుభవం అవసరమైందని తెలిపాడు.
ఇటీవల ది హండ్రెడ్ 2026లో సదరన్ బ్రేవ్ తరఫున బరిలోకి దిగిన మిల్లర్.. ఎనిమిది మ్యాచ్‌ల్లో 166పరుగులు చేశాడు.
వివరాలు
2027 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవాలి
ఈ ఫామ్‌ను కొనసాగిస్తూ 2027 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవాలని అతడు భావిస్తున్నాడు.
ఇక తన కెరీర్‌లో అత్యంత ఇష్టమైన ఐపీఎల్ జ్ఞాపకంగా 2022లో గుజరాత్ టైటాన్స్‌తో కలిసి సాధించిన టైటిల్ విజయాన్ని మిల్లర్ గుర్తుచేసుకున్నాడు.
అలాగే ఒత్తిడిలో సాధించిన రెండు సెంచరీలను తన అత్యుత్తమ ఇన్నింగ్స్‌లుగా పేర్కొన్నాడు.
ఆర్‌సీబీపై చేసిన 101 పరుగులు, ఆస్ట్రేలియాపై డర్బన్‌లో సాధించిన 118 నాటౌట్ తనకు ఎప్పటికీ ప్రత్యేకమైనవని చెప్పాడు.
ఇప్పుడు తన కెరీర్‌లో సంపాదించిన అనుభవాన్నంతా ఉపయోగించుకుని.. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాకు తొలి వన్డే ప్రపంచకప్ అందించాలనే కలతో డేవిడ్ మిల్లర్ ముందుకు సాగుతున్నాడు.