LOADING...
Richa Ghosh: రిచా ఘోష్‌ను భారత కెప్టెన్ గా చూడాలని ఉంది : సౌరభ్ గంగూలీ
రిచా ఘోష్‌ను భారత కెప్టెన్ గా చూడాలని ఉంది : సౌరభ్ గంగూలీ

Richa Ghosh: రిచా ఘోష్‌ను భారత కెప్టెన్ గా చూడాలని ఉంది : సౌరభ్ గంగూలీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 09, 2025
02:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే ప్రపంచకప్‌ విజేతల జట్టులో కీలక పాత్ర పోషించిన భారత మహిళా వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ రిచా ఘోష్‌ (Richa Ghosh)పై టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ (Sourav Ganguly) ప్రశంసల వర్షం కురిపించాడు. ఒత్తిడిగా ఉన్న పరిస్థితుల్లోనూ లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేస్తూ తక్కువ బంతుల్లోనే కీలక పరుగులు సాధించిందని గంగూలీ పేర్కొన్నాడు. శనివారం రిచా ఘోష్‌ను ఆమె స్వస్థలం పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన వేడుకకు గంగూలీ కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, "నీ కెరీర్‌ ఇప్పుడే ఆరంభమైంది. రాబోయే నాలుగు నుండి ఆరు సంవత్సరాల్లో మహిళల క్రికెట్‌ మరింత అభివృద్ధి చెందుతుంది.

Details

పెద్ద ఇన్నింగ్స్ ఆడిన రిచా ఘోష్

కొత్త అవకాశాలు విస్తారంగా వస్తాయి. నువ్వు వాటిని సద్వినియోగం చేసుకుంటావని నమ్ముతున్నా. ఒక రోజు జులన్‌ గోస్వామి లాగా 'రిచా భారత కెప్టెన్‌' అని మనమందరం గర్వంగా చెబుతాం. నీ వయసు కేవలం 22 ఏళ్లు మాత్రమే. నీ భవిష్యత్తు వెలుగులు విరజిమ్ముతుందని గంగూలీ అభినందించాడు. లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేయడం చాలా కష్టం. కానీ రిచా తక్కువ బంతుల్లోనే పెద్ద ఇన్నింగ్స్‌ ఆడింది. అందరూ సెమీ ఫైనల్‌లో జెమీమా రోడ్రిగ్స్‌ (127*), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (89) ఇన్నింగ్స్‌లను గుర్తుంచుకుంటారు. కానీ 130కు పైగా స్ట్రైక్‌రేట్‌తో రిచా చేసిన పరుగులు జట్టుకు ఎంతో విలువైనవని వ్యాఖ్యానించాడు.

Details

'బంగ భూషణ్‌' అవార్డు ప్రదానం

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రిచాకు రాష్ట్ర అత్యుత్తమ పౌర అవార్డు 'బంగ భూషణ్‌'ను ప్రదానం చేశారు. అంతేకాక ఆమెను డీఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఫైనల్లో ఆమె చేసిన 34 పరుగులకు గుర్తుగా రూ.34 లక్షల నగదు బహుమతితో పాటు స్వర్ణహారం కూడా అందించారు. ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులో చోటు దక్కిన తొలి బెంగాల్‌ క్రికెటర్‌గా రిచా ఘోష్‌ చరిత్ర సృష్టించింది. 2003లో టీమిండియా పురుషుల జట్టుతో గంగూలీ ఆ గౌరవాన్ని కొద్దిలో కోల్పోయాడు.