
SuryaKumar Yadav: పీసీబీ ఫిర్యాదు.. సూర్యకుమార్ యాదవ్‌కు ఐసీసీ భారీ జరిమానా
ఈ వార్తాకథనం ఏంటి
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) భారత T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు జరిమానా విధించింది. అతని మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధిస్తూ నిర్ణయం ప్రకటించింది. 2025 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ విజయం పహల్గాం ఉగ్రదాడి బాధితులకు, భారత సైనికులకు అంకితం చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్య రాజకీయ ప్రేరేపితమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అభిమానుల భావోద్వేగాలను గౌరవించేందుకు సూర్యకుమార్ చేసిన ఈ ప్రకటనను, పాక్ జట్టు ఉద్దేశపూర్వకంగా వివాదాస్పదం చేసింది. అలాగే మ్యాచ్ తర్వాత పాక్ కెప్టెన్ సల్మాన్ అఘాతో కరచాలనం చేయకపోవడం ద్వారా ఆటస్ఫూర్తిని ఉల్లంఘించాడని కూడా ఫిర్యాదులో పేర్కొంది.
వివరాలు
హారిస్ రవూఫ్ మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత
ఈ ఆరోపణల ఆధారంగా ఐసీసీ జరిమానా విధించింది. అయితే, ఈ నిర్ణయంపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) స్పందిస్తూ, ఐసీసీ తీర్పును సవాలు చేసింది. మరోవైపు.. పాకిస్థాన్ క్రికెటర్లు హారిస్ రవూఫ్, సాహిబ్జాదా ఫర్హాన్‌లపై ఐసీసీ గతంలో చర్యలు తీసుకుంది సూపర్ ఫోర్ మ్యాచ్‌లో హారిస్ రవూఫ్ అభ్యంతరకరమైన హావభావాలు వ్యక్త పరిచాడమే కాకుండా భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మాన్ గిల్‌లతో ఘర్షణకు దిగాడు. దీంతో అతడి మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించారు. అదే సమయంలో సాహిబ్జాదా ఫర్హాన్ "తుపాకీ సెలబ్రేషన్" చేసి భారత ఆటగాళ్లను ప్రేరేపించేందుకు యత్నించాడు. దాంతో ఐసీసీ అతనిని తీవ్రంగా మందలించింది.
వివరాలు
ఈ విజయాన్ని పహల్గాం దాడి బాధితులకు, దేశ సాయుధ బలగాలకు అంకితం
అయితే పహల్గాం ఉగ్రదాడి ఘటనల నేపథ్యంలో పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను భారత్ బహిష్కరించాలని కొన్ని వర్గాలు కోరినా, గ్రూప్ మ్యాచ్ మాత్రం జరిగింది. ఆ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా అద్భుత ప్రదర్శనతో పాక్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. పాక్ నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 15.5 ఓవర్లలోనే ఛేదించి ఘన విజయం సాధించింది. టాస్ సమయంలోనూ, మ్యాచ్ ముగిసిన తర్వాతనూ సూర్యకుమార్ పాక్ కెప్టెన్‌తో చేతులు కలపకుండా ఉండటమే వివాదానికి కారణమైంది. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈ విజయాన్ని పహల్గాం దాడి బాధితులకు, దేశ సాయుధ బలగాలకు అంకితం చేస్తున్నానని ఆయన స్పష్టం చేశాడు.