LOADING...
ICC: ఆటగాళ్ల భద్రతే మొదటి ప్రాధాన్యం: విమర్శలకు ఐసీసీ సమాధానం
ఆటగాళ్ల భద్రతే మొదటి ప్రాధాన్యం: విమర్శలకు ఐసీసీ సమాధానం

ICC: ఆటగాళ్ల భద్రతే మొదటి ప్రాధాన్యం: విమర్శలకు ఐసీసీ సమాధానం

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 12, 2026
10:12 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ తర్వాత జట్ల ప్రయాణ ఏర్పాట్లపై వచ్చిన విమర్శలకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) స్పందించింది. ఈ విమర్శలను ఖండిస్తూ, ఆటగాళ్లు మరియు వారి కుటుంబ సభ్యుల భద్రతకే తాము ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్‌ మధ్య జరుగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా గల్ఫ్‌ దేశాల్లో ప్రయాణ ఆంక్షలు విధించబడిన నేపథ్యంలో జట్లను స్వదేశాలకు సురక్షితంగా చేర్చేందుకు అత్యుత్తమ మార్గాలను అనుసరిస్తున్నామని ఐసీసీ వెల్లడించింది.

వివరాలు 

జట్ల ఆటగాళ్లు, సహాయక సిబ్బంది అసంతృప్తి

సెమీఫైనల్లో ఓటమి అనంతరం ఇంగ్లాండ్‌ జట్టు ఆటగాళ్లు మరుసటి రోజే స్వదేశానికి బయలుదేరారు. అయితే అంతకుముందే ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించిన వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా జట్ల ఆటగాళ్లు మాత్రం అనేక రోజులుగా భారత్‌లోనే ఉండాల్సి వచ్చింది. ఈ పరిస్థితిపై ఆ జట్ల ఆటగాళ్లు, సహాయక సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐసీసీ పక్షపాతంగా వ్యవహరిస్తోందని, సరైన ప్రయాణ ఏర్పాట్లు చేయలేకపోతోందని విమర్శలు కూడా వినిపించాయి. ఈ రెండు జట్ల కోసం కోల్‌కతా నుంచి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసినప్పటికీ, అనివార్య కారణాలతో ఆ విమానాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో ఆటగాళ్లకు వేర్వేరు వాణిజ్య విమానాల్లోనే టికెట్లు బుక్‌ చేసినట్లు ఐసీసీ తెలిపింది. తమపై వస్తున్న విమర్శలపై ఐసీసీ ప్రకటన విడుదల చేసింది.

వివరాలు 

స్వదేశానికి చేరుకున్న వెస్టిండీస్‌ జట్టుకు చెందిన తొమ్మిది మంది

''బుధవారం దక్షిణాఫ్రికా జట్టుకు చెందిన నలుగురు ఆటగాళ్లు మరియు వారి కుటుంబ సభ్యులు విమానంలో స్వదేశానికి బయలుదేరారు. వచ్చే 24 గంటల్లో ఆ జట్టుకు చెందిన మరో 29 మంది భారత్‌ నుంచి పయనమవుతారు. వెస్టిండీస్‌ జట్టుకు చెందిన తొమ్మిది మంది ఇప్పటికే స్వదేశానికి చేరుకున్నారు. మిగతా 16 మంది వచ్చే 12 గంటల్లో బయలుదేరనున్నారు'' అని ఐసీసీ తెలిపింది. ఇంకా, ఆటగాళ్లు,వారి కుటుంబ సభ్యుల భద్రత, సంక్షేమానికి సంబంధం లేని ఎలాంటి సలహాలను తాము స్వీకరించబోమని ఐసీసీ స్పష్టం చేసింది. వాస్తవ పరిస్థితి తెలియకుండా ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వ్యాఖ్యలు సరైనవి కావని పేర్కొంది. ఇంగ్లాండ్‌ జట్టుకు చేసిన ప్రయాణ ఏర్పాట్లను దక్షిణాఫ్రికా,వెస్టిండీస్‌ జట్లు ఎదుర్కొంటున్న పరిస్థితులతో పోల్చలేమని ఐసీసీ తెలిపింది.

Advertisement

వివరాలు 

అదనపు ఖర్చును మొత్తం ఐసీసీదే 

వారి ప్రయాణ మార్గాలు,పరిస్థితులు వేర్వేరుగా ఉన్నాయని వివరించింది. ప్రయాణం ఆలస్యం కావడంతో ఆటగాళ్లు,సహాయక సిబ్బంది అసహనం వ్యక్తం చేయడం సహజమని, వారి పరిస్థితిని తాము కూడా అర్థం చేసుకుంటున్నామని పేర్కొంది. ఈ సమస్యకు ప్రయాణ ఆంక్షలు సహా అనేక అంశాలు కారణమయ్యాయని ఐసీసీ వెల్లడించింది. ఆటగాళ్లతో పాటు వారి కుటుంబ సభ్యులు, చిన్నపిల్లలు కూడా ఉన్న నేపథ్యంలో అందరి భద్రతను పరిగణనలోకి తీసుకుని మాత్రమే ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపింది. పూర్తిగా సంతృప్తికరమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పుడే వారిని పంపిస్తామని, ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేసింది. ప్రయాణం ఆలస్యమవడంతో ఏర్పడుతున్న అదనపు ఖర్చును మొత్తం ఐసీసీనే భరిస్తోందని కూడా పేర్కొంది.

Advertisement