The Ashes: అక్కడైతే 'మంచి వికెట్'… ఇక్కడైతే 'ప్రమాదకరం'.. విదేశీ పిచ్‌లపై విమర్శలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో ఎప్పుడైనా టెస్టు మ్యాచ్‌లో పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటే, మ్యాచ్ రెండు లేదా మూడు రోజుల్లోనే ముగిసిపోతే చాలు... ప్రపంచ క్రికెట్ ప్రమాదంలో పడిందన్నట్లుగా విదేశీ మాజీ క్రికెటర్లు, మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున విమర్శలు ప్రారంభిస్తారు. ఇవేం పిచ్‌లు? మ్యాచ్‌లను ఇలా ఏకపక్షంగా ఎలా చేస్తారని టీమ్ ఇండియాపై ఆరోపణలు చేస్తుంటారు. కానీ అదే విదేశాల్లో పేస్‌కు అనుకూలమైన వికెట్లు అనూహ్యంగా స్పందించి, మ్యాచ్‌లు త్వరగా ముగిసినా మాత్రం ఆ విమర్శలు వినిపించవు. తమ జట్టు గెలిచినా, ఓడినా అక్కడ మాత్రం నిశ్శబ్దమే కనిపిస్తోంది.
Details
ఆట రెండు రోజులు కూడా జరగలేదు
యాషెస్ సిరీస్‌లో భాగంగా ప్రఖ్యాత మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరిగిన నాలుగో టెస్టులో రెండు రోజులు కూడా పూర్తిగా ఆట సాగలేదు. ఇప్పటికే సిరీస్‌లో 0-3తో వెనుకబడి ఉన్న ఇంగ్లాండ్, ఈ మ్యాచ్‌లో గెలిచి ఊరట పొందింది. అయితే విజయం సాధించినప్పటికీ ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ పిచ్ స్పందనపై అసహనం వ్యక్తం చేశాడు. ఏ పిచ్ ఇస్తే దానిపై ఆడడమే తమ పని అని చెబుతూనే, మరీ రెండు రోజుల్లోనే మ్యాచ్ ముగిసిపోవడం సరికాదన్న అభిప్రాయాన్ని వెల్లడించాడు. బాక్సింగ్ డే టెస్టు చూడాలనే ఆసక్తితో ఐదు రోజుల టికెట్లు కొనుగోలు చేసిన అభిమానుల పరిస్థితి ఏంటని ప్రశ్నించాడు.
Details
స్పందించిన కెవిన్ పీటర్సన్
ఆస్ట్రేలియా కాకుండా మరో దేశంలో ఇలాంటి పిచ్ స్పందించి ఉంటే ఎలా ఉండేదోనని కూడా వ్యాఖ్యానించాడు. ప్రస్తుత యాషెస్ సిరీస్‌లో ఇది కొత్త విషయం కాదు. ఇప్పటికే పెర్త్‌లో జరిగిన తొలి టెస్టు కూడా రెండో రోజే ముగిసింది. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. అంటే ప్రస్తుత యాషెస్‌లో ఒక టెస్టు రెండు రోజుల్లోనే ముగియడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కూడా ఈ అంశంపై స్పందించాడు. భారత్‌లో ఇలాంటి పిచ్‌లు ఉంటే పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టేవారని, కానీ ఆస్ట్రేలియాలో వికెట్ ఇంతగా స్పందించినప్పటికీ దానిపై సరైన చర్చ జరగడం లేదని వ్యాఖ్యానించాడు.
Details
విమర్శలు గుప్పించిన దినేశ్ కార్తీక్
ఇప్పటివరకు యాషెస్‌లో జరిగిన నాలుగు టెస్టులు కలిపి కేవలం 13 రోజుల్లోనే ముగిశాయని గుర్తు చేస్తూ, అయినా పిచ్‌లపై ప్రశ్నలు, విమర్శలు రాకపోవడంపై భారత మాజీ వికెట్‌కీపర్ దినేశ్ కార్తీక్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. భారత్‌లో పిచ్‌లు స్పిన్‌కు సహకరించి, విదేశీ బ్యాటర్లు ఇబ్బంది పడిన ప్రతిసారి ఇక్కడి వికెట్ల నాణ్యతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతుంటాయి. పర్యటక జట్లు ఐసీసీకి ఫిర్యాదులు చేయడం, పిచ్‌లపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం సాధారణంగా మారింది. ఫలితంగా ఐసీసీ హెచ్చరికలు, పిచ్‌లకు అయోగ్యత పాయింట్లు రావడం కూడా మామూలే. ఇటీవల భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి టెస్టు మూడో రోజే ముగిసింది. ఆ మ్యాచ్‌లో బౌలర్లు పూర్తిగా ఆధిపత్యం చెలాయించారు.
Details
ఆశ్చర్యం వ్యక్తం చేసిన సునీల్ గవాస్కర్
124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక భారత్ 93 పరుగులకే ఆలౌటైంది. ఆ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలిచింది. అందుకే పిచ్ నాణ్యతపై విదేశీ మీడియాలో పెద్దగా చర్చ జరగలేదు. అదే భారత్ గెలిచి ఉంటే మాత్రం... తమకు అనుకూలమైన వికెట్ తయారు చేసుకుని ప్రత్యర్థిని ఓడించిందన్న ఆరోపణలు వచ్చేవి, పిచ్‌ల నాణ్యతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తేవి. ఈ యాషెస్‌లో తొలి టెస్టు రెండు రోజుల్లోనే ముగిసినా పెర్త్ పిచ్‌పై ఎలాంటి విమర్శలు రాలేదు. మ్యాచ్ రిఫరీ కూడా ప్రతికూల నివేదిక ఇవ్వలేదు. ఐసీసీ సైతం ఆ పిచ్‌కు తక్కువ రేటింగ్ ఇవ్వలేదు. ఈ పరిణామంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Details
మంచి రేటింగ్ ఇవ్వడంపై మండిపాటు
నాలుగో టెస్టు వేదిక మెల్‌బోర్న్‌లోనూ రెండు రోజుల్లోనే మ్యాచ్ ముగిసినా ఆస్ట్రేలియా నుంచి, మీడియా నుంచి గట్టి స్పందన రాలేదని ఆయన గుర్తు చేశారు. అక్కడి పిచ్ కొంచెం ఎక్కువగా స్పందించిందని మాత్రమే ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ వ్యాఖ్యానించాడు. 'ఇలాంటి వికెట్లు మంచి పిచ్‌లు ఎలా అవుతాయి? వీటికి మంచి రేటింగ్ ఎలా ఇస్తున్నారు?' అంటూ సునీల్ గావస్కర్ మండిపడ్డారు. బెన్ స్టోక్స్, కెవిన్ పీటర్సన్, దినేశ్ కార్తీక్ సహా పలువురు వ్యక్తం చేసిన విమర్శల నేపథ్యంలో ఐసీసీ చివరకు స్పందించాల్సి వచ్చింది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌కు తక్కువ రేటింగ్ ఇవ్వడమే కాకుండా, ఒక అయోగ్యత పాయింటును కూడా కేటాయించింది.