French Open: క్వార్టర్-ఫైనల్‌లోకి దూసుకెళ్లిన ఇగా స్వియాటెక్
ఉక్రెయిన్ క్రీడాకారిణి లెసియా ట్సురెంకో అనారోగ్యం కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ లో మ్యాచ్ నుండి తప్పుకుంది. దీంతో మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్‌లో మంగళవారం క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ ఏడాది తొలిసారి గా కోర్టు సుజానే- లెంగ్లెన్‌లో ఈ మ్యాచ్ ను నిర్వహించారు. ఉక్రెయిన్ టెన్నిస్ క్రీడాకారాణి లెసియా ట్సురెంకో మొదటి సెట్ ను మాత్రమే ఆడగలిగింది. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆటను కొనసాగించలేకపోయింది. ఈ మొదటి సెట్ లో ఇగా స్వియాటెక్ 5-1 అధిక్యంలో కొనసాగింది.
క్వార్టర్ ఫైనల్లో కోకో గాఫ్ తో తలపడనున్న స్వియాటెక్
తన ఆనారోగ్యం గురించి ట్సెరెంకో స్పందించింది. తాను నిన్న కూడా ప్రాక్టీస్ చేయలేకపోయానని, ఆటలో నిలవడం చాలా కష్టమైందని, వేడి ఎక్కువగా ఉండడం వల్ల కూడా చాలా ఇబ్బందిగా మారిందని, అందుకే ఆటను నిలిపివేయాల్సి వచ్చిందని వెల్లడించింది. ఇగా స్వియాటెక్ మాట్లాడుతూ తాను చాలా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగానని, మొత్తంగా తన ప్రదర్శన పట్ల తాను చాలా సంతోషంగా ఉన్నానని, ట్సురెంకో తీసుకున్న నిర్ణయం సరైందని, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. క్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్, అమెరికా చెందిన కోకో గాఫ్ తో తలపడనుంది.