Bangladesh cricketers : భారత్-బంగ్లాదేశ్ ఉద్రిక్తతల ప్రభావం.. స్పాన్సర్‌షిప్ కోల్పోయే దిశగా బంగ్లా క్రికెటర్లు?
ఈ వార్తాకథనం ఏంటి
భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య క్రికెట్, దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెటర్లకు మరో ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. బంగ్లాదేశ్ క్రికెటర్లకు స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న భారత సంస్థ ఎస్‌జీ (SG) తమ స్పాన్సర్‌షిప్‌ను కొనసాగించకూడదనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బంగ్లాదేశ్ స్టార్ ఆటగాళ్లు లిటన్ దాస్, మోమినుల్ హక్, యాసిర్ అలీ తదితరులకు ప్రస్తుతం ఎస్‌జీ స్పాన్సర్‌గా ఉంది. ఎస్‌జీ స్పాన్సర్‌షిప్ ఒప్పందాన్ని పునరుద్ధరించకూడదనే నిర్ణయంపై ఇప్పటివరకు ఆటగాళ్లకు అధికారికంగా సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే ఈ పరిణామంపై వారి ఏజెంట్లకు సంకేతాలు అందినట్లు సమాచారం. త్వరలోనే ఎస్‌జీ స్పాన్సర్‌గా వైదొలిగే అవకాశముందని ఓ బంగ్లాదేశ్ క్రికెటర్ ప్రముఖ వెబ్‌సైట్‌కు తెలిపినట్లు వార్తలు వెలువడ్డాయి.
Details
బంగ్లాదేశ్‌లో రాజకీయాల్లో అనిశ్చితి
ఒకవేళ ఎస్‌జీ ఈ నిర్ణయం తీసుకుంటే, ఇతర సంస్థలు కూడా అదే బాటలో నడిచే అవకాశాన్ని కొట్టిపారేయలేమని సదరు క్రికెటర్ వ్యాఖ్యానించినట్లు పేర్కొంది. ఇక కొంతకాలంగా బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. ఈ క్రమంలో హిందువులపై వరుస దాడులు జరుగుతున్నాయి. ఈ ఘటనల్లో పలువురు హిందువులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్‌లో ఆడనివ్వకూడదనే డిమాండ్లు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. బీసీసీఐ ఆదేశాల మేరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) జట్టు ముస్తాఫిజుర్‌ను విడుదల చేసింది.
Details
ఉద్రిక్తంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ సంబంధాలు
ఈ నిర్ణయంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రతిస్పందనగా తమ దేశంలో ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో భద్రతా కారణాలను ప్రస్తావిస్తూ భారత్‌లో మ్యాచ్‌లు ఆడలేమని, తమ జట్టు ఆడే మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని కోరుతూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఐసీసీకి లేఖ రాసింది. అయితే బంగ్లాదేశ్ అభ్యర్థనపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ పరిణామాలతో భారత్-బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి.