Iran-Israel War Impact: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆ మ్యాచ్‌లు రద్దు!
ఈ వార్తాకథనం ఏంటి
మిడిల్ ఈస్ట్‌లో తీవ్రరూపం దాల్చుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈసీబీ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ క్షిపణి దాడులు కొనసాగుతుండటంతో యూఏఈ సహా గల్ఫ్ ప్రాంతంలో భద్రతా ఆందోళనలు మరింత పెరిగాయి. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని యూఏఈలో ఉన్న తమ జట్లను వెంటనే వెనక్కి రప్పించేందుకు బోర్డు అత్యవసర చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ లయన్స్ జట్టు యూఏఈలో పాకిస్థాన్ షాహీన్స్ జట్టుతో ఐదు వన్డేల సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే రెండో వన్డే రద్దయిన నేపథ్యంలో, మిగతా మూడు వన్డే మ్యాచ్‌లను కూడా పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఈసీబీ ప్రకటించింది. ఆటగాళ్లు, సహాయక సిబ్బందిని సురక్షితంగా బ్రిటన్‌కు తరలించేందుకు అత్యవసర ఏర్పాట్లు చేపట్టింది.
Details
విమాన సర్వీసులకు అంతరాయం
యుద్ధ ప్రభావంతో గల్ఫ్ ప్రాంతంలోని పలు విమానాశ్రయాల్లో విమాన సర్వీసులు అంతరాయం కలగడంతో ప్రయాణ ఏర్పాట్లు సవాలుగా మారాయి. మొదట ఈ టూర్‌లో మూడు టీ20లు, ఐదు వన్డేలు జరగాల్సి ఉండగా, టీ20 సిరీస్‌ను ఇంగ్లండ్ లయన్స్ 3-0తో కైవసం చేసుకుంది. అనంతరం వన్డే సిరీస్‌ను కూడా విజయంతో ఆరంభించింది. అయితే రెండో వన్డేకు ముందే ప్రాంతీయ ఉద్రిక్తతలు తీవ్రతరమవడంతో మిగతా మ్యాచ్‌లు నిలిచిపోయాయి. ఈ టూర్ మార్చి 9తో ముగియాల్సి ఉంది. ఇదిలా ఉండగా, ఇంగ్లాండ్ మహిళల జట్టు జూన్-జూలైలో బ్రిటన్‌లో జరిగే ఐసీసీ ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ సన్నాహకంగా అబూదాబిలో శిక్షణ శిబిరాన్ని ప్లాన్ చేసింది.
Details
త్వరలోనే కొత్త షెడ్యూల్ పై స్పష్టత
అయితే గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు నెలకొనడంతో ఆ క్యాంప్‌ను కూడా ఈసీబీ పూర్తిగా రద్దు చేసింది. ప్రత్యామ్నాయ ప్రణాళికపై ఇప్పటికే బోర్డు కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. త్వరలోనే కొత్త షెడ్యూల్‌పై స్పష్టత వచ్చే అవకాశముంది.