Loading...
Pakistan Team: ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూ వివాదం.. మైక్ అథర్టన్, నాజర్ హుస్సేన్‌లకు పీసీబీ షాక్!
ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూ వివాదం.. మైక్ అథర్టన్, నాజర్ హుస్సేన్‌లకు పీసీబీ షాక్!

Pakistan Team: ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూ వివాదం.. మైక్ అథర్టన్, నాజర్ హుస్సేన్‌లకు పీసీబీ షాక్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 19, 2026
01:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెట్ వ్యాఖ్యాతలు మైక్ అథర్టన్, నాజర్ హుస్సేన్‌లకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) షాక్ ఇచ్చింది. పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ముక్కోణపు సిరీస్ కోసం ప్రకటించిన కామెంట్రీ ప్యానల్‌లో ఈ ఇద్దరికీ చోటు కల్పించలేదు. ఈ ఏడాది ఆరంభంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కుమారులను మైక్ అథర్టన్ ఇంటర్వ్యూ చేయడం అప్పట్లో తీవ్ర వివాదానికి దారితీసింది. ఆ ఇంటర్వ్యూలపై పీసీబీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అథర్టన్‌తో పాటు నాజర్ హుస్సేన్ కూడా ఇమ్రాన్ ఖాన్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పాకిస్థాన్ వేదికగా ఇంగ్లాండ్, శ్రీలంక జట్లతో ముక్కోణపు సిరీస్ జరుగుతోంది.

వివరాలు

ఇదీ అసలు వివాదం..

ఈ సిరీస్ కోసం పీసీబీ ఆరుగురు సభ్యులతో కూడిన కామెంట్రీ ప్యానల్‌ను ప్రకటించింది.

అయితే అందులో మైక్ అథర్టన్, నాజర్ హుస్సేన్‌లకు చోటు దక్కలేదు. ఇమ్రాన్ ఖాన్ విషయంలో గతంలో చోటుచేసుకున్న వివాదమే ఈ నిర్ణయానికి కారణమా? అనే చర్చ మొదలైంది.

ఈ ఏడాది ఆరంభంలో ఇమ్రాన్ ఖాన్ కుమారులు ఖాసిమ్, సులేమాన్‌లను మైక్ అథర్టన్ ఇంటర్వ్యూ చేశారు.

ఆ సందర్భంగా తమ తండ్రిని జైలులోనే చంపేసేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని వారు ఆరోపించారు.

ఇమ్రాన్ ఖాన్ జైలు పరిస్థితులు, ఆయనకు అందుతున్న చికిత్సపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

వివరాలు

ఆరోపణలను ఖండించిన పీసీబీ

ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే ఈ ఇంటర్వ్యూ స్కై స్పోర్ట్స్‌లో ప్రసారం కావడం పీసీబీకి ఆగ్రహం తెప్పించింది.

ఈ విధంగా ఇంటర్వ్యూ ప్రసారం చేయడంపై బోర్డు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిని అనైతికంగా పేర్కొన్నట్లు సమాచారం.

మరోవైపు ఇమ్రాన్ ఖాన్ కుమారులు చేసిన ఆరోపణలను పాకిస్థాన్ ప్రభుత్వం ఖండించింది.

ఆయనకు మెరుగైన చికిత్స అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు అప్పట్లో ఓ ప్రకటనలో వెల్లడించింది.

ADVERTISEMENT

వివరాలు

పాత వివాదం  మరోసారి తెరపైకి

ఇమ్రాన్ ఖాన్ పరిస్థితిపై మైక్ అథర్టన్‌తో పాటు నాజర్ హుస్సేన్ కూడా ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ అంశం మరింత చర్చనీయాంశమైంది.

తాజాగా పాకిస్థాన్‌లో జరుగుతున్న ముక్కోణపు సిరీస్ కామెంట్రీ ప్యానల్‌లో ఈ ఇద్దరు మాజీ క్రికెటర్లకు చోటు దక్కకపోవడంతో పాత వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.

అయితే వారిని ప్యానల్‌లో చేర్చకపోవడానికి పీసీబీ అధికారికంగా ఇదే కారణమని ప్రకటించిందా లేదా అన్నది స్పష్టత రావాల్సి ఉంది.

ADVERTISEMENT