LOADING...
Ind vs Aus 4th T20: ఆస్ట్రేలియాతో భారత్‌ నాలుగో టీ20 నేడే.. ఆధిక్యం సాధించేది ఎవరు..?
ఆస్ట్రేలియాతో భారత్‌ నాలుగో టీ20 నేడే.. ఆధిక్యం సాధించేది ఎవరు..?

Ind vs Aus 4th T20: ఆస్ట్రేలియాతో భారత్‌ నాలుగో టీ20 నేడే.. ఆధిక్యం సాధించేది ఎవరు..?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 06, 2025
08:40 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్,ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ ఇప్పుడు ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. ఇరు జట్లు చెరో విజయం నమోదు చేయడంతో సిరీస్‌లో ఆధిక్యం కోసం నాల్గవ టీ20 మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. ఈ మ్యాచ్ నవంబర్ 6న మధ్యాహ్నం 1:45 గంటలకు భారత కాలమానం ప్రకారం ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ నగరంలో ఉన్న బిల్ పిప్పెన్ ఓవల్ ఈ మ్యాచ్‌కు వేదికగా నిలుస్తుంది.

వివరాలు 

పిచ్ పరిస్థితులు 

ఈ స్టేడియంలో ప్రారంభ ఓవర్లలో బౌలర్లకు మంచి సహకారం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా బంతి స్వింగ్ కారణంగా ఆరంభంలో బ్యాట్స్‌మెన్ కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆసక్తికర విషయమేమిటంటే, ఈ మైదానంలో ఇదే తొలిసారి అంతర్జాతీయ స్థాయి మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ ముందుకు సాగేకొద్దీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతుందని అంచనా. చివరి ఓవర్లలో బ్యాట్స్‌మెన్ దూకుడుగా పరుగులు సాదించే అవకాశం ఎక్కువ. అందువల్ల, ఈ పోరు పెద్ద స్కోర్లు నమోదయ్యే మ్యాచ్‌గా మారవచ్చని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

వివరాలు 

హెడ్-టు-హెడ్ రికార్డులు 

ఇరు జట్ల గత గణాంకాలు చూస్తే భారత్ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు రెండు జట్ల మధ్య 35 టీ20 మ్యాచ్‌లు జరగగా, భారత్ 21 మ్యాచ్‌లు గెలుచుకోగా, ఆస్ట్రేలియా 12 విజయాలు సాధించింది.2 మ్యాచ్‌లు ఫలితం లేకుండానే ముగిశాయి. జనవరి 2021 తరువాత జరిగిన 12 పోరులో భారత్ 8 మ్యాచ్‌లలో విజయం సాధించగా ఆస్ట్రేలియా కేవలం 3 సార్లు మాత్రమే గెలుపొందింది. ప్రస్తుత సిరీస్‌లో: తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రెండో మ్యాచ్ ఆస్ట్రేలియా గెలిచింది. మూడో మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. అందువల్ల సిరీస్ ప్రస్తుతం 1-1 సమానంగా ఉంది, కాబట్టి ఈ మ్యాచ్ ఇరుజట్లకు ముఖ్యం కానుంది.

వివరాలు 

తుది జట్ల అంచనా

ఇక తుది జట్ల అంచనాల విషయానికి వస్తే.. భారత జట్టులో సూర్య కుమార్ యాదవ్,అభిషేక్ శర్మ, శుభమన్ గిల్,తిలక్ వర్మ,సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్,అక్షర్ పటేల్, శివమ్ దూబే లేదా హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ లేదా వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా ఉండే అవకాశం ఉంది. మరోవైపు, మిచెల్ మార్ష్ నేతృత్వంలో ఆస్ట్రేలియా జట్టులో ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, జోష్ ఫిలిప్,మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, నాథన్ ఎల్లీస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హేజిల్‌వుడ్ వంటి ఆటగాళ్లు ఉండవచ్చని అంచనాగా చెప్పవచ్చు. ఈ మ్యాచ్ ద్వారా సిరీస్‌లో ఆధిక్యం సాధించాలనే లక్ష్యంతో ఇరు జట్లు మైదానంలో అడుగుపెట్టనున్నాయి.