LOADING...
IND vs AUS: కాన్‌బెర్రాలో నేడే భారత్, ఆస్ట్రేలియా తొలి టీ20..
కాన్‌బెర్రాలో నేడే భారత్, ఆస్ట్రేలియా తొలి టీ20..

IND vs AUS: కాన్‌బెర్రాలో నేడే భారత్, ఆస్ట్రేలియా తొలి టీ20..

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 29, 2025
09:03 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంకో నాలుగు నెలల్లో భారత్‌లో జరగబోయే టీ20 ప్రపంచకప్‌కు ముందు,ఆ టోర్నీకి సిద్ధమవుతూ టీమిండియా కీలకమైన సిరీస్‌లో ఆస్ట్రేలియాను దాని నేలపై ఎదుర్కోడానికి సిద్ధమవుతోంది. 5టీ20ల సిరీస్‌లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి.వన్డేల్లో భారత్‌ ఓడినప్పటికీ,టీ20ల్లో మాత్రం భిన్న ఫలితాన్ని అందుకునే అవకాశాలున్నాయని క్రికెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. అన్ని విభాగాల్లో జట్టు సమతుల్యంగా కనిపించడం ఇందుకు ప్రధాన కారణం. ఇటు అభిషేక్‌.. అటు బుమ్రా: సూర్యకుమార్‌ యాదవ్‌ నాయకత్వంలో భారత్‌ ఇటీవల ఆసియా కప్‌లో అద్భుత ప్రదర్శనతో ట్రోఫీని గెలుచుకుంది. ఆటోర్నీలో ధాటిగా ఆడిన అభిషేక్‌ శర్మపై ఈ సిరీస్‌లో కూడా అందరి చూపు నిలిచింది. ఆస్ట్రేలియా పేస్‌కు అనుకూలమైన కాన్‌బెర్రా పిచ్‌పై హేజిల్‌వుడ్‌ నేతృత్వంలోని బౌలర్లను ఎలా ఎదుర్కొంటాడన్న ఆసక్తి నెలకొంది.

వివరాలు 

సూర్య ఫామ్‌ ఆందోళన 

అలాగే ఆసియా కప్‌ ఫైనల్లో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన తిలక్‌ వర్మపై కూడా మంచి అంచనాలున్నాయి. టెస్టుల్లో రాణిస్తున్నప్పటికీ, వన్డేలు మరియు టీ20ల్లో స్థిరత్వం చూపలేకపోయిన శుభమన్‌ గిల్‌ ఈ సిరీస్‌లో తన ఫామ్‌ తిరిగి పొందుతాడని అభిమానులు ఆశిస్తున్నారు. సూర్య సారథ్యంలోని భారత జట్టు వరుస విజయాలు సాధిస్తున్నప్పటికీ, అతని వ్యక్తిగత ఫామ్‌ మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఆసియా కప్‌లో అతడు ఏడు మ్యాచ్‌ల్లో కేవలం 72 పరుగులకే పరిమితమయ్యాడు. ఈ సిరీస్‌లోనూ ఫామ్‌ రాకపోతే, కెప్టెన్‌ పదవిపై చర్చలు మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది. హార్దిక్‌ పాండ్య గాయంతో జట్టుకు దూరమవడంతో, సంజు శాంసన్‌, శివమ్‌ దూబే, అక్షర్‌ పటేల్‌ మిడిల్‌ ఆర్డర్లో కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది.

వివరాలు 

జస్‌ప్రీత్‌ బుమ్రా

ఇక ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా తిరిగి ఆడడం భారత్‌కు బలాన్నిస్తుంది. గతంలో ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌లో అదరగొట్టిన బుమ్రా, ఇప్పుడు తనకు నప్పే పిచ్‌లపై మళ్లీ ప్రతిభ చూపుతాడని అభిమానులు నమ్ముతున్నారు. అతనితో అర్ష్‌దీప్‌ కొత్త బంతిని పంచుకోగా, హర్షిత్‌ రాణా మూడో పేసర్‌గా బరిలోకి దిగే అవకాశముంది. స్పిన్‌ విభాగంలో అక్షర్‌కు తోడుగా వరుణ్‌ చక్రవర్తి లేదా కుల్‌దీప్‌ యాదవ్‌లో ఒకరు చోటు దక్కించుకునే అవకాశం ఉంది.

వివరాలు 

బలంగా కనిపిస్తున్న ఆస్ట్రేలియా 

వన్డేలతో పోలిస్తే ఆస్ట్రేలియా టీ20ల్లో బలంగా కనిపిస్తోంది. టిమ్‌ డేవిడ్‌, మార్కస్‌ స్టాయినిస్‌, జోష్‌ ఇంగ్లిస్‌ లాంటి ఆటగాళ్లు జట్టుకు అదనపు బలం ఇస్తున్నారు. కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ సూపర్‌ ఫామ్‌లో ఉండగా, వన్డేల్లో పెద్దగా రాణించని ట్రావిస్‌ హెడ్‌ ఈ సిరీస్‌లో తిరిగి చెలరేగుతాడని జట్టు ఆశిస్తోంది. మాథ్యూ షార్ట్‌, మిచెల్‌ ఒవెన్‌ లాంటి బ్యాట్స్‌మెన్లు ఉన్నందున ఆసీస్‌ బ్యాటింగ్‌ విభాగం మరింత బలంగా ఉంది. వన్డేల్లో ఆకట్టుకున్న హేజిల్‌వుడ్‌తో పాటు బార్ట్‌లెట్‌, డ్వార్షుయిస్‌, ఎలిస్‌లతో పేస్‌ విభాగం కూడా బలంగా ఉంది. అయితే ప్రధాన స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా గైర్హాజరీ భారత్‌కు కొంత ఊరట. అయినప్పటికీ కునెమన్‌ ప్రతిభావంతుడైన స్పిన్నర్‌గా అతని స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది.

వివరాలు 

గణాంకాలు 

చివరి 10 టీ20ల్లో భారత్‌ ఒక్క మ్యాచ్‌లోనే ఓటమి చవిచూసింది. 8 విజయాలు సాధించగా, ఒకటి టై అయింది. అదే సమయంలో ఆస్ట్రేలియా కూడా చివరి 10 మ్యాచ్‌ల్లో కేవలం ఒకదానిలోనే ఓడింది; 8 విజయాలు నమోదు చేసుకోగా, ఒక మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. పిచ్‌ & వాతావరణం తొలి టీ20 జరగబోయే కాన్‌బెర్రా పిచ్‌ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. పేసర్లను ఎదుర్కోవడం బ్యాటర్లకు కాస్త సవాలుగా ఉంటుంది. బౌండరీలు పెద్దవిగా ఉండటంతో భారీ స్కోర్లు సాధ్యంకావు. సుమారు 160 పరుగులు చేసిన జట్టు ఆ స్కోరును కాపాడుకునే అవకాశముంది. వాతావరణ పరంగా బుధవారం వర్షం సూచనలున్నప్పటికీ, మ్యాచ్‌ సమయానికి పెద్దగా అంతరాయం కలగదని స్థానిక వాతావరణ శాఖ తెలిపింది.

వివరాలు 

తుది జట్లు (అంచనా)...

భారత్‌: అభిషేక్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్, సూర్యకుమార్‌ (కెప్టెన్‌), సంజు శాంసన్, తిలక్‌ వర్మ, శివమ్‌ దూబె, అక్షర్‌ పటేల్, బుమ్రా, హర్షిత్‌ రాణా, అర్ష్‌దీప్, వరుణ్‌ చక్రవర్తి/కుల్‌దీప్‌ ఆస్ట్రేలియా: మిచెల్‌ మార్ష్‌ (కెప్టెన్‌), ట్రావిస్‌ హెడ్, జోష్‌ ఇంగ్లిస్, మాథ్యూ షార్ట్, మిచెల్‌ ఒవెన్, స్టాయినిస్, టిమ్‌ డేవిడ్, డ్వార్షుయిస్‌/ఎలిస్, బార్ట్‌లెట్, హేజిల్‌వుడ్, కునెమన్‌.