LOADING...
IND vs ENG: ఇంగ్లాండ్‌తో భారత్‌కు చివరి టీ20 నేడు.. పరువు నిలబెట్టుకుంటుందా?
ఇంగ్లాండ్‌తో భారత్‌కు చివరి టీ20 నేడు.. పరువు నిలబెట్టుకుంటుందా?

IND vs ENG: ఇంగ్లాండ్‌తో భారత్‌కు చివరి టీ20 నేడు.. పరువు నిలబెట్టుకుంటుందా?

వ్రాసిన వారు Moogati Shabari
Jul 11, 2026
09:40 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐర్లాండ్ వంటి పసికూన జట్టు చేతిలో టీమిండియా వైట్‌వాష్‌కు గురైనప్పుడు అది ఒక్కసారిగా జరిగిన వైఫల్యమేనని భారత అభిమానులు భావించారు. అయితే అదే నిరాశాజనక ప్రదర్శనను ఇంగ్లాండ్ పర్యటనలోనూ కొనసాగించిన శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని భారత జట్టు వరుసగా మూడు టీ20ల్లో ఓటమిపాలై మరో వైట్‌వాష్ అంచున నిలిచింది. వరుసగా రెండుసార్లు టీ20 ప్రపంచ విజేతగా నిలిచిన భారత జట్టు నుంచి ఇలాంటి పేలవ ప్రదర్శనను ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు శనివారం జరిగే నాలుగో, చివరి టీ20లో విజయం సాధించి పరువు కాపాడుకుంటుందా? లేక మరోసారి క్లీన్‌స్వీప్ అవుతూ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

వివరాలు

యూకే పర్యటనలో విఫలం..

యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో పాటు భారత జట్టులోని ప్రధాన బ్యాటర్లంతా ఇటీవల ఐపీఎల్‌లో భారీగా పరుగులు సాధించిన వారే. కానీ యూకే పర్యటనలో మాత్రం దాదాపు అందరూ విఫలమయ్యారు. దీంతో భారత బ్యాటర్లు స్వదేశంలోని ఫ్లాట్ పిచ్‌లపైనే రాణిస్తారనే విమర్శలు మరింత బలపడుతున్నాయి. విదేశీ పర్యటనల్లో ఆరంభంలో తడబడినా తరువాత గాడిన పడటం భారత బ్యాటర్లకు అలవాటే. కానీ ఈ సిరీస్‌లో మాత్రం వరుసగా వైఫల్యాలు వెంటాడుతున్నాయి. ఐర్లాండ్, ఇంగ్లాండ్ బౌలర్లు విసిరిన సవాల్‌ను ఎదుర్కోవడంలో భారత బ్యాటింగ్ విభాగం పూర్తిగా తేలిపోయింది.

వివరాలు

భారీ పరాజయం..

మూడో టీ20లో భారత్ కేవలం 76 పరుగులకే ఆలౌట్ అయి టీ20 చరిత్రలోనే అత్యంత భారీ పరాజయాన్ని చవిచూసింది. అనంతరం జరిగిన మ్యాచ్‌లో 150 పరుగుల మార్క్‌ను దాటినా పరిస్థితి మారలేదు. ఇంగ్లాండ్ బ్యాటర్లు లక్ష్యాన్ని కేవలం 14 ఓవర్లలోనే ఛేదించి భారత్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ ఇచ్చారు. భారత బ్యాటర్లు ఇబ్బందులు పడిన అదే పిచ్‌పై ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ 35 బంతుల్లో 79 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడగా, ఓపెనర్ ఫిల్ సాల్ట్ 42 బంతుల్లో 59 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టుకు సునాయాస విజయాన్ని అందించాడు. మరోవైపు భారత బౌలర్లు మాత్రం ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు.

Advertisement