IND Vs IRE: వరుస విజయాలకు బ్రేక్.. భారత్‌ను చిత్తు చేసిన ఐర్లాండ్
ఈ వార్తాకథనం ఏంటి
ఐర్లాండ్‌తో జరిగిన రెండో, చివరి టీ20లో భారత్ ఒక్క పరుగు తేడాతో ఓటమి చవిచూసింది. ఇటీవల కాలంగా బ్యాటింగ్‌లో ఎదురవుతున్న వైఫల్యాలు ఈ మ్యాచ్‌లోనూ కొనసాగాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. హ్యారీ టెక్టార్ 47 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 53 పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచాడు. భారత్ బౌలర్లలో అరంగేట్ర పేసర్ ప్రిన్స్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 22 పరుగులకే 3 వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ సింగ్ 35 పరుగులకు 2 వికెట్లు, శివమ్ దూబె 25 పరుగులకు 2 వికెట్లు, హర్షిత్ రాణా 17 పరుగులకు ఒక వికెట్ తీసి రాణించారు.
వివరాలు
రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న ఐర్లాండ్
155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 153 పరుగులే చేయగలిగింది. తిలక్ వర్మ 46 బంతుల్లో 3 ఫోర్లు,ఒక సిక్స్‌తో 55 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. భారత సంతతికి చెందిన ఐర్లాండ్ బౌలర్ జై ముంద్రా 32 పరుగులకు 3 వికెట్లు పడగొట్టగా,హాలార్డ్ 26 పరుగులకు 3 వికెట్లు తీసి భారత్ బ్యాటింగ్‌ను దెబ్బతీశాడు. ఈ విజయంతో ఐర్లాండ్ రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. భారత్‌పై ఏ ఫార్మాట్‌లోనైనా సిరీస్ గెలవడం ఐర్లాండ్‌కు ఇదే తొలిసారి.అలాగే భారత్ వరుసగా 16 టీ20 సిరీస్‌ల్లో సాధించిన విజయాల పరంపరకు కూడా ఈ మ్యాచ్‌తో తెరపడింది.
వివరాలు
ఛేదనలో భారత్ తడబాటు
ప్రిన్స్ యాదవ్‌తో పాటు ఆల్‌రౌండర్ సూర్యాంశ్ షెడ్జే ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయగా,వైభవ్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. లక్ష్య ఛేదనలో భారత్‌కు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. విధ్వంసక ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ తొలి ఓవర్లోనే డకౌట్‌గా వెనుదిరిగారు. అనంతరం మూడో ఓవర్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 10 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ ముగ్గురు వికెట్లను జై ముంద్రా తన ఖాతాలో వేసుకున్నాడు.ఐదో ఓవర్లో ఇషాన్ కిషన్ 12 పరుగుల వద్ద రనౌట్ కావడంతో భారత్ 35 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
వివరాలు
మ్యాచ్ చివరి దశలో పట్టు బిగించిన ఐర్లాండ్
ఆ సమయంలో తిలక్ వర్మ బాధ్యతగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అక్షర్ పటేల్ (14)తో కలిసి ఐదో వికెట్‌కు 39 పరుగులు జోడించి జట్టును గాడిలో పెట్టాడు. అక్షర్ అవుటైన తర్వాత శివమ్ దూబె (20)తో కలిసి తిలక్ మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 16 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 5 వికెట్ల నష్టానికి 109 పరుగులతో పోటీలోనే నిలిచింది. అయితే మ్యాచ్ చివరి దశలో ఐర్లాండ్ బౌలర్లు పట్టు బిగించారు. 17వ ఓవర్లో హంఫ్రీస్ కేవలం 2 పరుగులే ఇచ్చి దూబెను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత హాలార్డ్ ఒకే ఓవర్లో తిలక్ వర్మతో పాటు సూర్యాంశ్ షెడ్జే (1) వికెట్లు తీసి మ్యాచ్‌ను ఐర్లాండ్ వైపు తిప్పాడు.
వివరాలు
ఒక్క పరుగు తేడాతో భారత్ పరాజయం
19వ ఓవర్లో హర్షిత్ రాణా వరుసగా ఒక ఫోర్, ఒక సిక్స్‌తో 21 పరుగులు చేసి భారత్‌కు ఆశలు కల్పించాడు. చివరి ఓవర్లో విజయానికి 20 పరుగులు అవసరమయ్యాయి. తొలి రెండు బంతుల్లోనే 9 పరుగులు రావడంతో ఉత్కంఠ నెలకొన్నా, చివరికి భారత్ లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. చివరి రెండు బంతుల్లో 8 పరుగులు అవసరమైన సమయంలో హర్షిత్ అవుట్ అయ్యాడు. ఆఖరి బంతికి ప్రిన్స్ యాదవ్ సిక్స్ బాదినా, జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. దీంతో భారత్ ఒక్క పరుగు తేడాతో పరాజయం చవిచూసింది.