IND vs WI: ఉప్పల్‌లో నేడు భారత్, వెస్టిండీస్ నాలుగో టీ20.. సంజూ, తిలక్‌ను ఊరిస్తున్న భారీ రికార్డులు
ఈ వార్తాకథనం ఏంటి
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్లు నేడు (అక్టోబర్ 14, బుధవారం) హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో నాలుగో టీ20 మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టార్ ఆటగాళ్లు సంజు శాంసన్, తిలక్ వర్మ అరుదైన రికార్డుపై కన్నేశారు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 100 సిక్సర్ల మైలురాయిని చేరుకునేందుకు ఇద్దరికీ అవకాశం ఉంది. అయితే, ఈ ఘనతను అందుకోవడానికి సంజూ శాంసన్‌కు కేవలం రెండు సిక్సర్లు అవసరం కాగా.. తిలక్ వర్మ మరో 10 సిక్సర్లు బాదాల్సి ఉంది.
వివరాలు
సంజూ రెండు సిక్సర్లు కొడితే..
నేటి మ్యాచ్‌లో సంజూ శాంసన్ రెండు సిక్సర్లు బాదితే అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 100 సిక్సర్లు పూర్తి చేసుకుంటాడు.
తద్వారా ఈ ఘనత సాధించిన ఆరో భారత బ్యాటర్‌గా రికార్డులకెక్కుతాడు.
ఇప్పటివరకు రోహిత్ శర్మ, అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా మాత్రమే భారత్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో 100కు పైగా సిక్సర్లు కొట్టారు.
సంజూ శాంసన్ 2015లో అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 75 మ్యాచ్‌లు ఆడిన అతడు 28.8 సగటుతో 1,663 పరుగులు సాధించాడు.
ఇందులో మూడు సెంచరీలు, తొమ్మిది అర్ధసెంచరీలు ఉన్నాయి. తన అంతర్జాతీయ టీ20 కెరీర్లో 142 ఫోర్లు, 98 సిక్సర్లు బాదాడు.
వివరాలు
తిలక్ వర్మకు మరో 10 సిక్సర్లు కొడితే..
మరోవైపు తిలక్ వర్మ కూడా అంతర్జాతీయ టీ20ల్లో 100 సిక్సర్ల మైలురాయికి చేరువలో ఉన్నాడు.
ఈ ఘనత సాధించాలంటే అతడు మరో 10 సిక్సర్లు కొట్టాలి.హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం తిలక్ వర్మకు సొంత మైదానం కావడంతో అభిమానుల్లో అతడిపై ప్రత్యేక అంచనాలు ఉన్నాయి.
అయితే, ఒకే మ్యాచ్‌లో 10 సిక్సర్లు బాదడం అంత సులభం కాదు. అయినప్పటికీ, సొంత మైదానంలో తిలక్ ఈ అరుదైన ఘనత సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
తిలక్ వర్మ 2023లో అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేశాడు.
ఇప్పటివరకు 68 మ్యాచ్‌లు ఆడిన అతడు 44.8 సగటుతో 1,791 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 10 అర్ధసెంచరీలు ఉన్నాయి.
వివరాలు
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాళ్లు..
ఇప్పటివరకు 138 ఫోర్లు, 90 సిక్సర్లు బాదాడు. నేటి మ్యాచ్‌లో తిలక్ భారీ ఇన్నింగ్స్ ఆడితే ఈ మైలురాయికి మరింత చేరువయ్యే అవకాశం ఉంది.
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో భారత తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలోని వివరాలు ఇలా ఉన్నాయి.
రోహిత్ శర్మ - 159 మ్యాచ్‌ల్లో 205 సిక్సర్లు
సూర్యకుమార్ యాదవ్ - 113 మ్యాచ్‌ల్లో 179 సిక్సర్లు
అభిషేక్ శర్మ - 65 మ్యాచ్‌ల్లో 141 సిక్సర్లు
హార్దిక్ పాండ్యా - 138 మ్యాచ్‌ల్లో 126 సిక్సర్లు
వివరాలు
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాళ్లు..
విరాట్ కోహ్లీ - 125 మ్యాచ్‌ల్లో 124 సిక్సర్లు
కేఎల్ రాహుల్ - 72 మ్యాచ్‌ల్లో 99 సిక్సర్లు
సంజూ శాంసన్ - 75 మ్యాచ్‌ల్లో 98 సిక్సర్లు
తిలక్ వర్మ - 68 మ్యాచ్‌ల్లో 90 సిక్సర్లు