
Madan Lal: 'పబ్లిసిటీ కోసం అసభ్య వ్యాఖ్యలు'.. పాక్ క్రికెటర్లపై మదన్‌లాల్ ఘాటు విమర్శ
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ తర్వాత వివాదం మరింత ముదిరింది. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా భారత ఆటగాళ్లు పాకిస్థాన్ ప్లేయర్లతో కరచాలనం చేయకపోవడం తెలిసిందే. ఈ నిర్ణయం పాక్ మాజీ ఆటగాళ్లకు తీవ్ర అవమానంగా అనిపించింది. అందువల్ల వారు పలు ఇంటర్వ్యూల్లో భారత్‌పై విరుచుకుపడుతున్నారు. తాజాగా పాక్ మాజీ కెప్టెన్ మహ్మద్ యూసఫ్ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేరును ఉద్దేశపూర్వకంగా తప్పుగా పలకడం, అసభ్య రీతిలో సంబోధించడం ఆయనపై విమర్శల వర్షం కురిపించింది. దీనిపై భారత మాజీ క్రికెటర్ మదన్‌లాల్ తీవ్రంగా స్పందించారు.
Details
అనవసరంగా ఆరోపణలు చేయడం సిగ్గుచేటు
మదన్‌లాల్ స్పందన ''ఇది అంతా పబ్లిసిటీ స్టంట్ మాత్రమే. పాక్ మాజీ క్రికెటర్లు ఎప్పుడూ వార్తల్లో నిలవాలని ఇలాగే ప్రవర్తిస్తారు. భారత ఆటగాళ్ల ఆధిపత్యం వారిని మానసికంగా ఖాళీ చేసి వేసింది. అందుకే అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఇది వారి చదువు, సంస్కారం తెలియజేస్తోంది. తిట్టడాన్ని ఎవరూ సహించరు. అలాంటి వారిపై స్పందిస్తే వారికే మరింత పబ్లిసిటీ ఇచ్చినట్లవుతుంది. అదే వారు కోరుకుంటారు. ఇక అంపైర్ల నిర్ణయాలపై కూడా అనవసరంగా ఆరోపణలు చేయడం ఆశ్చర్యకరం. నేటి టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో అందరికీ తెలుసు. సందేహం ఉంటే సమీక్ష అడగొచ్చు. తప్పైతే రివర్స్ అవుతుంది. ఎప్పుడు సమీక్ష తీసుకోవాలో అర్థం చేసుకుంటేనే క్రికెట్‌లో విజయాలు సాధించవచ్చని మదన్‌లాల్ వ్యాఖ్యానించారు.
Details
యూసఫ్ ఏమన్నాడంటే?
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఓ పాకిస్థాన్ ఛానల్‌లో జరిగిన చర్చలో యూసఫ్ పాల్గొన్నాడు. అప్పుడు టీమిండియా చేసిన పొరపాట్లపై విమర్శలు గుప్పిస్తూ సూర్యకుమార్ యాదవ్ పేరును అసభ్యంగా పలికాడు. యాంకర్ అడ్డుపడినా.. మళ్లీ అదే రీతిలో ఆయనను సంబోధించాడు. అనంతరం, 'భారత్ మోసపూరిత చర్యలతో గెలుస్తోంది. అంపైర్లు, రిఫరీలందరూ వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి దానికి పరిమితి ఉంటుందంటూ విమర్శలు కొనసాగించాడు. ఈ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున విమర్శలకు గురైనా, వెనక్కి తగ్గని యూసఫ్.. తర్వాత సోషల్ మీడియాలో మరోసారి పోస్టు పెట్టాడు. గతంలో షాహిద్ అఫ్రిదీపై ఇర్ఫాన్ పఠాన్ చేసిన కామెంట్లను ప్రస్తావిస్తూ, భారత మీడియాపైనా దాడి చేశాడు.