LOADING...
IND-W vs SL-W T20 2025: బ్యాట్‌,బంతితో ఆధిపత్యం.. శ్రీలంకతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత మహిళలు
శ్రీలంకతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన మహిళా జట్టు

IND-W vs SL-W T20 2025: బ్యాట్‌,బంతితో ఆధిపత్యం.. శ్రీలంకతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత మహిళలు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 31, 2025
08:26 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత మహిళల క్రికెట్‌ జట్టు తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. ఐదో,ఆఖరి టీ20 మ్యాచ్‌లో శ్రీలంకపై 15 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడుతూ 43 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 68 పరుగులు చేసింది. ఆమె నాయకత్వ ఇన్నింగ్స్‌ ఫలితంగా భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు సాధించింది. చివర్లో అరుంధతి రెడ్డి 11 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 27 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి స్కోరును మరింత పెంచింది. లక్ష్య ఛేదనలో శ్రీలంక 7 వికెట్లకు 160 పరుగులకే పరిమితమైంది.

వివరాలు 

భారత్‌ 5-0తో సిరీస్‌ గెలవడం ఇది మూడోసారి

హాసిని పెరీరా (42 బంతుల్లో 65; 8 ఫోర్లు, 1 సిక్స్‌), ఇమేషా (39 బంతుల్లో 50; 8 ఫోర్లు) అర్ధశతకాలు చేసినా జట్టును గెలిపించలేకపోయారు. భారత బౌలర్లలో దీప్తి, అరుంధతి, స్నేహ్‌, వైష్ణవి, శ్రీచరణి, అమన్‌జ్యోత్‌ చెరో వికెట్‌ తీశారు. మహిళల టీ20 క్రికెట్‌లో భారత్‌ 5-0తో సిరీస్‌ గెలవడం ఇది మూడోసారి కాగా, సొంతగడ్డపై ఇదే తొలి క్లీన్‌స్వీప్‌. ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు దక్కగా, షెఫాలి వర్మ 'ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌'గా ఎంపికైంది.

వివరాలు 

ఛేదనలో తడబడ్డ లంక

ఛేదనలో శ్రీలంక ఆరంభంలోనే ఓపెనర్‌ చమరి (2) వికెట్‌ను 7 పరుగుల వద్ద కోల్పోయింది. అయితే హాసిని,ఇమేషా సమర్థంగా ఆడడంతో 11 ఓవర్లకు స్కోరు 86/1గా నిలిచి పోరులో నిలిచింది. కానీ అమన్‌జ్యోత్‌ బౌలింగ్‌లో ఇమేషా ఔట్‌ కావడంతో కీలక భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత నుంచి లంక వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అవసరమైన రన్‌రేట్‌ వేగంగా పెరుగుతూ ఒత్తిడి పెరిగింది. నీలాక్షిక (3), కవిష (5) నిరాశపరిచారు.ఐదో వికెట్‌గా హాసిని వెనుదిరగడంతో 17 ఓవర్లలో స్కోరు 132/5గా మారింది. మిగతా ఓవర్లలో మ్యాచ్‌ ఫలితం దాదాపు తేలిపోయింది. ఇదే మ్యాచ్‌లో దీప్తి శర్మ మహిళల టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచింది.

Advertisement

వివరాలు 

భారత్ ను ఆదుకున్న హర్మన్‌ప్రీత్

ఆస్ట్రేలియా బౌలర్‌ మెగాన్‌ షట్‌ (151 వికెట్లు) రికార్డును ఆమె అధిగమించింది. భారత్‌ ఈ స్థాయి స్కోరు సాధించడానికి ప్రధాన కారణం కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ పోరాటమే. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు షెఫాలి వర్మ (5), కమలిని (12) త్వరగానే ఔట్‌ అయ్యారు. ఏడో ఓవర్లో హర్లీన్‌ డియోల్‌ (13) నిష్క్రమించేసరికి స్కోరు 41 మాత్రమే. ఒక వైపు హర్మన్‌ప్రీత్‌ నిలబడినా, మరోవైపు రిచా ఘోష్‌ (5), దీప్తి శర్మ (7) కూడా విఫలమవడంతో భారత్‌ 11వ ఓవర్లో 77/5తో తక్కువకే ఆలౌటయ్యే ప్రమాదంలో పడింది.

Advertisement

వివరాలు 

భారత్ ను ఆదుకున్న హర్మన్‌ప్రీత్

ఈ దశలో పట్టుదల చూపిన హర్మన్‌ప్రీత్‌ చక్కని టైమింగ్‌తో షాట్లు ఆడి బౌండరీలతో జోరు పెంచింది. చమరి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదిన ఆమె సింగిల్‌తో అర్ధశతకం పూర్తి చేసింది. అమన్‌జ్యోత్‌ (18 బంతుల్లో 21; 1 ఫోర్‌, 1 సిక్స్‌) కీలక సహకారం అందించింది. వీరిద్దరి మధ్య 61 పరుగుల భాగస్వామ్యం 17వ ఓవర్లో అమన్‌జ్యోత్‌ ఔట్‌ కావడంతో ముగిసింది. తదుపరి ఓవర్లో హర్మన్‌ప్రీత్‌ కూడా వెనుదిరిగినా, చివర్లో అరుంధతి రెడ్డి దూకుడు చూపింది. చివరి రెండు ఓవర్లలో భారత్‌కు 32 పరుగులు వచ్చాయి. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో మల్కీ బౌలింగ్‌లో అరుంధతి వరుసగా 6, 4, 4 బాదుతూ జట్టును బలమైన స్కోరు అందించింది.

Advertisement