LOADING...
India vs South Africa: దక్షిణాఫ్రికాతో భారత్‌ రెండో వన్డే నేడు.. భారత జట్టుకు రాయ్‌పుర్‌ పరీక్ష
దక్షిణాఫ్రికాతో భారత్‌ రెండో వన్డే నేడు.. భారత జట్టుకు రాయ్‌పుర్‌ పరీక్ష

India vs South Africa: దక్షిణాఫ్రికాతో భారత్‌ రెండో వన్డే నేడు.. భారత జట్టుకు రాయ్‌పుర్‌ పరీక్ష

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 03, 2025
09:01 am

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌ గెలిచిన టీమ్‌ ఇండియా పైచేయి సాధించింది. ఇప్పుడు రెండో వన్డేలోనూ విజయాన్ని నమోదు చేసి, మూడో మ్యాచ్‌ అవసరం లేకుండానే సిరీస్‌ ముగించాలనే లక్ష్యంతో మైదానంలోకి దిగుతోంది. బుధవారం రాయ్‌పుర్‌లో జరగనున్న ఈ పోరు భారత జట్టుకు ఎంతో కీలకంగా మారింది. రాంచిలో జరిగిన తొలి వన్డేలో భారత బ్యాటింగ్‌ లైనప్‌ అదిరిపోయే ప్రదర్శన ఇచ్చింది. అంచనాలను దాటి ఆడిన బ్యాటర్లు భారీ స్కోరును నమోదు చేసి 349 పరుగులు చేసింది. అయినా బౌలర్ల వైఫల్యంతో చివరి వరకు ఉత్కంఠ తప్పలేదు. ప్రధాన పేసర్లు బుమ్రా, సిరాజ్‌ అందుబాటులో లేకపోవడంతో ఇన్‌ఎక్స్‌పీరియన్స్ పేస్‌ యూనిట్‌ ఒత్తిడిలో కనిపించింది.

వివరాలు 

పంత్‌కు ఛాన్సుందా?: 

రాయ్‌పుర్‌ పిచ్‌ సాధారణంగా బౌలర్లకు సహాయపడుతుంది కాబట్టి, ఈసారి బౌలింగ్‌ విభాగం ఎంత సమర్థంగా స్పందిస్తుందో కీలకంగా మారింది. తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అపూర్వ సెంచరీతో పరుగుల వరద పారించగా, రోహిత్‌ శర్మతో పాటు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ నిలకడగా అర్ధశతకాలు సాధించారు. రెండో వన్డేలో కూడా ఈ ముగ్గురే టీమ్‌ ఇండియా బ్యాటింగ్‌కు ప్రధాన ఆధారం అవనున్నారు. అభిమానులు మరోసారి 'రో-కో' షోను ఆస్వాదించాలని ఎదురుచూస్తున్నారు. గతంలో రాయ్‌పుర్‌లో జరిగిన ఏకైక వన్డేలో రోహిత్‌ అద్భుత అర్ధశతకం సాధించగా, భారత్‌ న్యూజిలాండ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసి ఘన విజయాన్ని అందుకుంది. ఆ మ్యాచ్‌లో పేసర్లు,స్పిన్నర్లు కలిసి ప్రత్యర్థిని పూర్తిగా నియంత్రించారు.

వివరాలు 

పంత్‌కు ఛాన్సుందా?: 

ఇక్కడి పిచ్‌ బౌలర్లకు అనుకూలం కాబట్టి బ్యాటర్లు ఆచితూచి ఆడాల్సిందే. వన్డే ఫార్మాట్‌లో సత్తా చాటాలని చూస్తున్న యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌పై టీమ్‌ మేనేజ్‌మెంట్ దృష్టి సారించింది. ఈ మ్యాచ్‌లో అయినా అతను పెద్ద ఇన్నింగ్స్‌ను ఆడుతాడని ఆశిస్తున్నారు. నాలుగో స్థానంలో విఫలమైన రుతురాజ్‌ గైక్వాడ్‌ స్థానంలో వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌కు అవకాశం ఇవ్వాలన్న ప్రతిపాదన చర్చలో ఉంది. అయితే ఒక్క మ్యాచ్‌లో విఫలమైయ్యాడని రుతురాజ్‌ను తప్పించడం కఠిన నిర్ణయమే అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తుది జట్టులో మార్పు జరిగితే ఇదొక్కటే ఉండొచ్చని భావిస్తున్నారు.

Advertisement

వివరాలు 

పంత్‌కు ఛాన్సుందా?: 

పేస్‌ విభాగంలో అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షిత్‌ రాణా, ప్రసిద్ధ్‌ కృష్ణల ప్రదర్శనపై ఈ మ్యాచ్‌లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. తొలి వన్డేలో నాలుగు వికెట్లతో మెరిసిన స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ మరోసారి కీలక పాత్ర పోషించే అవకాశముంది. వాషింగ్టన్‌ సుందర్‌ ఆల్‌రౌండర్‌ పాత్రకు ఈ మ్యాచ్‌లో అయినా న్యాయం చేస్తాడని జట్టు చూస్తోంది. మిడిల్‌ ఆర్డర్‌లో జడేజాతో కలిసి అతను బ్యాటుతో సత్తా చాటాల్సి ఉంది.

Advertisement

వివరాలు 

రెండు మార్పులతో దక్షిణాఫ్రికా!: 

రెండో వన్డే కోసం దక్షిణాఫ్రికా జట్టు తన కాంబినేషన్‌లో రెండు మార్పులకు సిద్ధమైంది. తొలి మ్యాచ్‌కు దూరంగా ఉన్న కెప్టెన్‌ టెంబా బవుమా ఈ గేమ్‌లో తుది జట్టులోకి వస్తుండగా, స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌కూ అవకాశమిచ్చారు. బవుమా రాకతో వికెట్‌కీపర్‌ బ్యాటర్లైన ర్యాన్‌ రికెల్టన్‌, క్వింటన్‌ డికాక్‌లలో ఒకరు జట్టుకు దూరం కావాల్సి ఉంటుంది. తొలి వన్డేలో ఈ ఇద్దరూ ఖాతా తెరువకపోవడం గమనార్హం. భారత బ్యాటర్ల ధాటికి ఎదురొడ్డి నిలవలేకపోయిన సుబ్రయెన్‌ను తప్పించి మహరాజ్‌ను జట్టులోకి చేర్చనున్నారు.

వివరాలు 

రెండు మార్పులతో దక్షిణాఫ్రికా!: 

రాంచిలో ఓటమి ఎదురైనా సఫారీ జట్టు పోరాట తీరుతో మెప్పించింది. భారీ లక్ష్య ఛేదనలో తొలి దశలో 3 వికెట్లు త్వరగా కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత స్కోరు 130/5కి చేరినా వెనుకడుగు వేయలేదు. బ్రీజ్కే, జాన్సెన్‌, బోష్‌ల పట్టుదలతో పోరు చివరి వరకూ సాగింది. బ్రెవిస్‌, జోర్జి అందించిన కీలక పరుగులు జట్టుకు ఊతమయ్యాయి. ఈ ఉత్సాహాన్ని కొనసాగిస్తూ రెండో వన్డేలో గెలిచి సిరీస్‌ను మూడో మ్యాచ్‌కు తీసుకెళ్లాలని దక్షిణాఫ్రికా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో టాప్‌ ఆర్డర్‌ రాణించడంపైనే ఆ జట్టు ప్రధాన ఆశలు ఉన్నాయి. బౌలింగ్‌లో జాన్సెన్‌, బర్గర్‌, మహరాజ్‌లపై కీలక బాధ్యతలు పెట్టుకుంది.

వివరాలు 

తుది జట్లు (అంచనా) 

భారత్‌: రోహిత్, యశస్వి, కోహ్లి, రుతురాజ్‌/పంత్, రాహుల్, సుందర్, జడేజా, హర్షిత్‌ రాణా, కుల్‌దీప్, అర్ష్‌దీప్, ప్రసిద్ధ్‌. దక్షిణాఫ్రికా: మార్‌క్రమ్, రికిల్‌టన్‌/డికాక్, బవుమా, బ్రీజ్కే, జోర్జి, బ్రెవిస్, యాన్సెన్, బోష్, కేశవ్, బర్గర్, బార్ట్‌మన్‌.

Advertisement