IND w Vs SL w: మూడో టీ20లో గెలుపే లక్ష్యం.. సిరీస్‌పై భారత్ కన్ను
ఈ వార్తాకథనం ఏంటి
బ్యాటింగ్‌లో ఎదురులేని దూకుడు.. బౌలింగ్‌లో ఏమాత్రం వెనకడుగు లేని ఆధిపత్యం. వరుసగా రెండు టీ20ల్లో భారత మహిళల జట్టే హవా చూపించింది. ప్రత్యర్థి నుంచి గణనీయమైన ప్రతిఘటన లేకుండా శ్రీలంకపై పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయించింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నప్పటికీ, మూడో మ్యాచ్‌లోనే సిరీస్‌ను ఖాయం చేసుకోవాలనే పట్టుదలతో భారత జట్టు ఉంది. విశాఖపట్నంలో జరిగిన తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘన విజయాలు సాధించిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. శుక్రవారం తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో మూడో టీ20లో శ్రీలంకను ఎదుర్కొననుంది.
Details
రాణిస్తున్న భారత బౌలర్లు
సూపర్ ఫామ్‌లో ఉన్న భారత జట్టును ఎదుర్కోవడం లంకకు గట్టి సవాలుగా మారింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా తమ సత్తాను చాటారు. క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తున్న స్పిన్నర్లు శ్రీచరణి, వైష్ణవి శర్మతో పాటు పేసర్ క్రాంతి గౌడ్.. శ్రీలంక బ్యాటర్లను క్రీజులో నిలదొక్కుకోనీయడం లేదు. ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేస్తూ బ్యాటర్ల పనిని మరింత సులభం చేస్తున్నారు. తొలి మ్యాచ్‌లో 121 పరుగులకే పరిమితమైన లంక.. రెండో మ్యాచ్‌లోనూ 128 పరుగులే చేయగలిగింది. మూడో మ్యాచ్‌లోనూ బౌలర్ల నుంచి ఇదే స్థాయి ప్రదర్శనను జట్టు మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది.
Details
పిచ్ బ్యాటింగ్ కు అనుకూలం
అయితే బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే తిరువనంతపురం పిచ్‌పై భారత బౌలర్లు తమ జోరును కొనసాగించగలరా అన్నది ఆసక్తికరంగా మారింది. జ్వరం కారణంగా రెండో మ్యాచ్‌కు దూరమైన దీప్తి శర్మ మూడో టీ20లో బరిలోకి దిగనున్న విషయం భారత జట్టుకు అదనపు బలంగా మారనుంది. ఆమె రాకతో బౌలింగ్ విభాగం మరింత బలోపేతం కానుంది. బ్యాటింగ్ విభాగంలో స్మృతి మంధాన నుంచి పెద్ద ఇన్నింగ్స్‌ను జట్టు ఆశిస్తోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆమె వరుసగా 25, 14 పరుగులకే అవుట్ అయ్యింది. అయితే జెమీమా రోడ్రిగ్స్, షెఫాలి వర్మ అర్ధసెంచరీలతో అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నారు. టాప్ ఆర్డర్ బ్యాటర్లే విజయాలను అందించడంతో మిగతా బ్యాటర్లకు ఇప్పటివరకు బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు.
Details
రికార్డు ముంగిట దీప్తి శర్మ
మరోవైపు సిరీస్‌లో తమ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలనే ఆశతో శ్రీలంక బరిలోకి దిగుతోంది. 2024లో చివరిసారిగా భారత్‌పై లంక విజయం సాధించింది. భారత్‌తో ఇప్పటివరకు 11 అంతర్జాతీయ టీ20లు ఆడిన శ్రీలంక.. అందులో 9 మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూసింది. మరో నాలుగు వికెట్లు పడగొడితే, అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా దీప్తి శర్మ (148 వికెట్లు) కొత్త రికార్డు నెలకొల్పనుంది.
Details
పిచ్, టాస్ పరిస్థితులు
గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో ఇప్పటివరకు జరిగిన నాలుగు అంతర్జాతీయ టీ20ల్లో ప్రతిసారి తొలుత బ్యాటింగ్ చేసిన జట్టే విజయం సాధించింది. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. మంచు ప్రభావం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో, టాస్ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్‌ను ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.