LOADING...
IND vs OMN: ఒమన్‌పై భారత్ ప్రయోగాత్మక విజయం.. సూపర్-4కి రిహార్సల్‌?
ఒమన్‌పై భారత్ ప్రయోగాత్మక విజయం.. సూపర్-4కి రిహార్సల్‌?

IND vs OMN: ఒమన్‌పై భారత్ ప్రయోగాత్మక విజయం.. సూపర్-4కి రిహార్సల్‌?

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 20, 2025
09:00 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్‌ 2025లో భారత్‌ తన లీగ్‌ దశ చివరి మ్యాచ్‌ను విజయవంతంగా ముగించింది. ఒమన్‌పై 21 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా ఒక దశలో ఓటమి బాట పట్టిందేమోనన్న అనుమానం కలిగించింది. కానీ, అనుభవం లోపం ఒమన్‌కు అడ్డంకిగా మారి విజయం భారత్‌ ఖాతాలో చేరింది. ఈ మ్యాచ్‌లో కొత్త వ్యూహాలను అమలు చేస్తూ రాబోయే సూపర్-4 కోసం టీమ్‌ఇండియా ప్రయోగాలు చేసింది. కాస్తంత మిస్‌ఫైర్‌ అయ్యే ప్రమాదం ఎదురైనా.. ఈ మూడు మార్పులు మాత్రం ముందున్న పోరాటాల్లో మంచి ఫలితాలకే దోహదం చేస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Details

సూర్య ఎంట్రీ మిస్టరీ

సూర్యకుమార్‌ యాదవ్‌ క్రీజులోకి అడుగుపెడితే ప్రత్యర్థి బౌలర్లకు సతమతమయ్యే పరిస్థితి వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ, ఈసారి అలా జరగలేదు. ఓవైపు వికెట్లు పడిపోతున్నా.. సూర్యను క్రీజులోకి రానివ్వకపోవడం అభిమానుల్లో అనుమానాలు రేకెత్తించింది. ఎలాంటి గాయం జరిగిందా? అన్న చర్చలు కూడా జరిగాయి. అయితే, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రణాళిక వేరు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పరుగులు చేయగల సూర్యకు బదులుగా మిగతా బ్యాటర్లకు మరింత ప్రాక్టీస్‌ దక్కేలా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు చేసింది. ఇద్దరు ఆటగాళ్లు రనౌట్ల రూపంలో ఔటైనప్పటికీ భారత్‌ పోటీకి తగిన స్కోరే సాధించింది. రాబోయే సూపర్-4లో పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌తో తలపడాల్సి ఉండటంతో ఒక్కో పరుగు విలువైనదిగా మారనుంది.

Details

  అవకాశాన్ని వినియోగించుకున్న సంజు శాంసన్

మొదటి రెండు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌ చేసే అవకాశం రాని సంజూ ఈసారి వచ్చిన ఛాన్స్‌ను చక్కగా వినియోగించుకున్నాడు. తిలక్‌ వర్మ, అక్షర్‌ పటేల్‌ కూడా తమ స్థానం ఏదైనా పరుగులు చేయగలమని రుజువు చేశారు. హర్షిత్‌ రాణా కూడా బ్యాట్‌తో తాను నిలబడతాననే నమ్మకాన్ని కలిగించాడు. నిజానికి సూర్య క్రీజులోకి వచ్చి ఆడినట్లయితే స్కోరు బోర్డు 200 పైగా చేరేదేమో కానీ, మిగతా వారికి మ్యాచ్‌ ప్రాక్టీస్‌ దక్కకుండా పోయేదే.

Details

సీనియర్స్‌కి విశ్రాంతి.. యువతకు అవకాశాలు

సీనియర్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తికి ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చింది టీమ్‌ మేనేజ్‌మెంట్‌. బదులుగా బెంచ్‌కే పరిమితమైన అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షిత్‌ రాణాకు అవకాశం కల్పించింది. అర్ష్‌దీప్‌ తన ప్రదర్శనతో వంద వికెట్ల క్లబ్‌లో అడుగుపెట్టగా, హర్షిత్‌ ఆల్‌రౌండర్‌గా తన ప్రతిభను చాటాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ ఆకట్టుకున్నాడు. ఫీల్డింగ్‌లోనూ భారత్‌ మెరిసింది. ముఖ్యంగా హార్దిక్‌ పాండ్య చివర్లో పట్టిన కీలక క్యాచ్‌ మ్యాచ్‌ను భారత్‌ వైపు తిప్పింది. ఆ క్యాచ్‌ మిస్సయి ఉంటే గెలుపు మరింత కష్టతరమయ్యేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మార్పులు, ప్రయోగాలు రాబోయే సూపర్-4 పోరాటాల్లో భారత్‌కు మరింత శక్తివంతమైన ప్రదర్శనకు తోడ్పడతాయనే నమ్మకం వ్యక్తమవుతోంది.