Loading...
Women's Hockey World Cup: భారత్‌ పోరాటం వృథా.. మహిళల హాకీ ప్రపంచకప్‌ నుంచి ఔట్‌!
భారత్‌ పోరాటం వృథా.. మహిళల హాకీ ప్రపంచకప్‌ నుంచి ఔట్‌!

Women's Hockey World Cup: భారత్‌ పోరాటం వృథా.. మహిళల హాకీ ప్రపంచకప్‌ నుంచి ఔట్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 24, 2026
09:32 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత మహిళల హకీ జట్టు ప్రపంచకప్‌లో పతకం సాధించాలన్న కల చెదిరిపోయింది. సెమీఫైనల్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన కీలకమైన పూల్‌-ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత్‌ 0-0తో డ్రా చేసుకుంది. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. స్టేజ్‌-2 ముగిసే సమయానికి భారత్‌, చైనా, ఆస్ట్రేలియా జట్లు తలో రెండు పాయింట్లతో సమంగా నిలిచాయి. అయితే మెరుగైన గోల్‌ వ్యత్యాసం కారణంగా ఆస్ట్రేలియా గ్రూప్‌లో రెండో స్థానాన్ని దక్కించుకుని సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. ఇప్పటికే పూల్‌-ఈ నుంచి నెదర్లాండ్స్‌ సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ప్రారంభం నుంచే ఉత్కంఠ నెలకొంది. రెండో నిమిషంలోనే ఆస్ట్రేలియా గోల్‌ సాధించినట్లు కనిపించింది.

వివరాలు

సద్వినియోగం చేసుకోలేకపోయిన భారత్

గ్రేస్‌ స్టివార్ట్‌ కొట్టిన షాట్‌ గోల్‌లోకి వెళ్లినప్పటికీ.. అది ఫౌల్‌ అని రిఫరీ తేల్చడంతో ఆస్ట్రేలియాకు గోల్‌ దక్కలేదు. దీంతో తొలి క్వార్టర్‌ 0-0తో ముగిసింది.

రెండో క్వార్టర్‌లో ఆస్ట్రేలియా దూకుడు మరింత పెంచింది. వరుస దాడులతో గోల్‌ అవకాశాలను సృష్టించుకున్నప్పటికీ భారత డిఫెండర్లు అద్భుతంగా అడ్డుకున్నారు.

క్వార్టర్‌ చివర్లో భారత్‌కు కూడా గోల్‌ చేసే అవకాశం లభించింది. మరో 21 సెకన్లలో రెండో క్వార్టర్‌ ముగుస్తుందనగా భారత జట్టుకు పెనాల్టీ కార్నర్‌ (PC) లభించింది.

అయితే దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. మూడో క్వార్టర్‌ ఆరంభంలో, 40వ నిమిషంలో ఆస్ట్రేలియా మరోసారి గోల్‌ కొట్టింది.

వివరాలు

చివరకు మ్యాచ్‌ 0-0తో డ్రాగా ముగిసింది

కెర్‌షా కొట్టిన షాట్‌ గోల్‌లోకి వెళ్లే ముందు భారత డిఫెండర్‌ చేతికి తాకడంతో రిఫరీ ఆ గోల్‌ను కూడా రద్దు చేశారు. దీంతో భారత్‌ ఊపిరి పీల్చుకుంది.

ఆ తర్వాత భారత డిఫెన్స్‌ మరింత పటిష్టంగా మారింది.

ఆస్ట్రేలియాకు పెనాల్టీ కార్నర్లు సాధించే అవకాశాలు కూడా ఇవ్వకుండా భారత ఆటగాళ్లు అడ్డుకున్నారు. నాలుగో క్వార్టర్‌ మొదలయ్యే సరికి మ్యాచ్‌ తీవ్ర ఉత్కంఠకు చేరుకుంది.

చివరి నిమిషాల్లో భారత్‌ గోల్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరకు మ్యాచ్‌ 0-0తో డ్రాగా ముగియడంతో.. సెమీఫైనల్‌ చేరాలన్న భారత అమ్మాయిల ఆశలు ఆవిరయ్యాయి.

ADVERTISEMENT