
ENG vs IND : ఓవల్ వేదికపై భారత రికార్డులు బలహీనమే.. ఐదో టెస్టులో గెలుపు సాధ్యం కాదా?
ఈ వార్తాకథనం ఏంటి
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ కింద భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ఇప్పటి వరకు జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్ రెండు విజయాలు సాధించగా, భారత్ ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించింది. మిగిలిన ఒక టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో ఇంగ్లాండ్ ప్రస్తుతం సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు ఐదో మరియు ఫైనల్ టెస్టు మ్యాచ్ జూలై 31 నుంచి ఆగస్ట్ 4 వరకు లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ భారత్‌కు అత్యంత కీలకం కానుంది. గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేయాలని భారత జట్టు పట్టుదలగా ఉంది.
Details
గెలవాలని పట్టుదలతో టీమిండియా
మరోవైపు ఇంగ్లాండ్ మాత్రం ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకోవాలని చూస్తోంది. మ్యాచ్ డ్రాగా ముగిసినా సిరీస్ విజయం ఇంగ్లాండ్‌కే చెందుతుంది. ఈ నేపథ్యంలో ఓవల్ మైదానంలో భారత్ రికార్డు ఎలా ఉందో ఓసారి పరిశీలిద్దాం. 1936 నుండి ఇప్పటి వరకు భారత్ ఈ మైదానంలో మొత్తం 15 టెస్టులు ఆడింది. అందులో కేవలం రెండు మ్యాచ్‌లలో మాత్రమే భారత్ విజయాన్ని నమోదు చేసింది. ఆరు టెస్టుల్లో భారత్ ఓడిపోయింది. మిగిలిన ఏడు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
Details
2007లో భారీ స్కోరు
భారత్ ఈ మైదానంలో చివరిసారిగా 2023లో ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడింది. అయితే, ఆ మ్యాచ్‌లో భారత్ 209 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇక కెన్నింగ్టన్ ఓవల్‌లో భారత్ చేసిన అత్యధిక స్కోరు 664 పరుగులు. 2007లో ఇంగ్లాండ్‌పై భారత్ ఈ భారీ స్కోరు నమోదు చేసింది. అదే మైదానంలో భారత్ అత్యల్ప స్కోరు 94. 2014లో ఇంగ్లాండ్‌తోనే జరిగిన టెస్టులో ఈ స్కోరు నమోదైంది. ఈ మైదానంలో భారత దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ 1979లో 221 పరుగులతో డబుల్ సెంచరీ చేశాడు. ఇప్పటివరకు మరో భారత బ్యాటర్ ఆ స్కోరును దాటలేకపోవడం గమనార్హం.