Para Archery: పారా ఆర్చరీలో భారత్ సత్తా.. రెండు స్వర్ణాలు,నాలుగు కాంస్యాలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ వేదికగా తొలిసారి నిర్వహించిన అంతర్జాతీయ పారా ఆర్చరీ పోటీలు ఘనంగా ముగిశాయి. ప్రపంచ పారా ఆర్చరీ సిరీస్ స్టేజ్-3లో చివరి రోజు భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. బుధవారం జరిగిన పోటీల్లో భారత క్రీడాకారులు రెండు స్వర్ణ పతకాలతో పాటు నాలుగు కాంస్య పతకాలు సాధించారు. దీంతో ఆతిథ్య దేశం ఈ పోటీలను విజయవంతంగా ముగించింది. కాంపౌండ్ విభాగంలో ప్రపంచ ఛాంపియన్ శీతల్ దేవి మరోసారి తన సత్తా చాటింది. ఫైనల్లో కజకిస్థాన్‌కు చెందిన ఐజాదా సీడన్‌తో తలపడిన శీతల్‌కు గట్టి పోటీ ఎదురైంది. నిర్ణీత రౌండ్లు ముగిసే సమయానికి ఇరువురి స్కోరు 144-144తో సమంగా నిలిచింది. దీంతో విజేతను నిర్ణయించేందుకు షూటాఫ్ నిర్వహించారు.
వివరాలు
ఫైనల్లో భారత ద్వయం చైనాపై పూర్తి ఆధిపత్యం
షూటాఫ్‌లో శీతల్ పది పాయింట్లు సాధించగా.. ఐజాదా 9 పాయింట్లకే పరిమితమైంది. దీంతో శీతల్ దేవి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో పారాలింపిక్స్ ఛాంపియన్ హర్విందర్ సింగ్, భావన జోడీ భారత్‌కు మరో పసిడి పతకాన్ని అందించింది.
ఫైనల్లో భారత ద్వయం చైనాకు చెందిన లియాంగ్, జియాల జంటపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.
6-0 తేడాతో చైనా జోడీని ఓడించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.
వివరాలు
భారత్‌లో తొలిసారిగా ప్రపంచ పారా ఆర్చరీ సిరీస్ స్టేజ్-3
కాంపౌండ్ మిక్స్‌డ్ విభాగంలో శీతల్ దేవి, తోమన్ కుమార్ జోడీ కాంస్య పతకం సాధించింది.
రికర్వ్ విభాగంలో జరిగిన కాంస్య పతక పోరులో భావన.. భారత్‌కే చెందిన రాజశ్రీ రాథోడ్‌ను ఓడించి మూడో స్థానాన్ని దక్కించుకుంది.
ఇదే విభాగంలో సరిత కూడా కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో తోమన్ కుమార్ కూడా కాంస్య పతకం సాధించాడు.
మొత్తంగా చివరి రోజు భారత పారా ఆర్చర్లు రెండు స్వర్ణాలు, నాలుగు కాంస్యాలతో మెరిశారు.
భారత్‌లో తొలిసారిగా జరిగిన ప్రపంచ పారా ఆర్చరీ సిరీస్ స్టేజ్-3ను ఆతిథ్య దేశం అద్భుత విజయాలతో ముగించింది.