IND w vs AUS w: పింక్ బాల్ టెస్టులో భారత్‌కు షాక్.. ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం
ఈ వార్తాకథనం ఏంటి
పెర్త్ వేదికగా జరిగిన ఏకైక పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టుపై ఆస్ట్రేలియా జట్టు ఘన విజయం సాధించింది. ఇండియా ఉమెన్స్ టీంను 10 వికెట్ల తేడాతో ఓడించి కంగారూ జట్టు ఆధిపత్యం ప్రదర్శించింది. భారత్ నిర్దేశించిన 25 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు కేవలం 4.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసి సులభంగా గెలుపొందింది. ఓపెనర్లు జార్జియా వాల్ (16; 13 బంతుల్లో 4 ఫోర్లు), ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (11; 14 బంతుల్లో 1 ఫోర్) నాటౌట్‌గా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చారు. అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 105/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించింది.
Details
149 పరుగులకు భారత్ ఆలౌట్
అయితే బ్యాటింగ్‌లో మరోసారి విఫలమైన భారత జట్టు 149 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా ముందు కేవలం 24 పరుగుల లక్ష్యం మాత్రమే నిలిచింది. భారత జట్టులో ప్రతీక రావల్ (63; 137 బంతుల్లో 8 ఫోర్లు) ఒంటరి పోరాటం చేసింది. అలాగే స్నేహ రానా (30; 54 బంతుల్లో 4 ఫోర్లు) కొంతమేర రాణించింది. మిగతా బ్యాటర్లు మాత్రం నిరాశపరిచారు. స్మృతి మంధాన (2), షఫాలీ వర్మ (5), జెమిమా రోడ్రిగ్స్ (14), హర్మన్‌ప్రీత్ కౌర్ (11), దీప్తి శర్మ (9), రిచా ఘోష్ (0), కష్వీ గౌతమ్ (0) ఇలా అందరూ తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. క్రాంతి గౌడ్ (0) నాటౌట్‌గా నిలిచింది.
Details
మొదటి ఇన్నింగ్స్ లో 198 పరుగులు
ఆస్ట్రేలియా బౌలర్లలో కిమ్ గార్త్ 3 వికెట్లు తీసుకోగా, అన్నాబెల్ సదర్లాండ్, అలానా కింగ్, ఆష్లీ గార్డనర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. అలాగే డార్సీ బ్రౌన్ ఒక వికెట్ సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 198 పరుగులు చేసింది. దానికి ప్రతిగా ఆస్ట్రేలియా జట్టు 323 పరుగులు చేసి భారీ ఆధిక్యం సాధించిన విషయం తెలిసిందే. దీంతో చివరకు మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం చాటుతూ కంగారూలు విజయం సాధించారు.