Loading...
Womens hockey world cup: దక్షిణాఫ్రికాపై భారత్‌ ఘన విజయం.. 6-1తో చిత్తు చేసిన అమ్మాయిలు
దక్షిణాఫ్రికాపై భారత్‌ ఘన విజయం.. 6-1తో చిత్తు చేసిన అమ్మాయిలు

Womens hockey world cup: దక్షిణాఫ్రికాపై భారత్‌ ఘన విజయం.. 6-1తో చిత్తు చేసిన అమ్మాయిలు

వ్రాసిన వారు Moogati Shabari
Aug 19, 2026
09:53 am

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత జట్టు సత్తా చాటుతోంది. తొలి మ్యాచ్‌లో పటిష్ఠమైన చైనాతో డ్రా చేసుకున్న సలీమా సేన.. రెండో మ్యాచ్‌లో మాత్రం అదరగొట్టింది. మంగళవారం జరిగిన పూల్‌-డి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్‌ ఏకంగా 6-1 తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌ మొదలైనప్పటి నుంచే భారత మహిళలు దూకుడైన ఆటతీరును ప్రదర్శించారు. ప్రత్యర్థి జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస దాడులతో దక్షిణాఫ్రికా గోల్‌పోస్ట్‌పై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో 11వ నిమిషంలో భారత్‌కు తొలి గోల్‌ లభించింది. సాక్షి కొట్టిన షాట్‌ను గోల్‌ దిశగా మళ్లించిన సునెలిటా టొప్పో.. బంతిని నెట్‌లోకి పంపి భారత్‌ ఖాతా తెరిచింది.

వివరాలు

పెనాల్టీ కార్నర్‌ను అద్భుతంగా వినియోగించుకున్న నవ్‌నీత్‌ కౌర్‌..

ఆ తర్వాత కొద్దిసేపటికే భారత ఆధిక్యం రెట్టింపైంది. 17వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను నవ్‌నీత్‌ కౌర్‌ అద్భుతంగా ఉపయోగించుకుంది.

ఆమె బలంగా కొట్టిన బంతి దక్షిణాఫ్రికా గోల్‌కీపర్‌, డిఫెండర్‌ మధ్య నుంచి దూసుకెళ్లి నేరుగా గోల్‌గా మారింది.

రెండో గోల్‌తో ఆగని భారత జట్టు.. ప్రత్యర్థిపై దాడులను మరింత తీవ్రతరం చేసింది.

25వ నిమిషంలో దీపిక కొట్టిన పెనాల్టీ కార్నర్‌ షాట్‌ను దక్షిణాఫ్రికా డిఫెండర్‌ అడ్డుకుంది.

అయితే బంతి రీబౌండ్‌ కావడంతో అక్కడే అప్రమత్తంగా ఉన్న సుశీల దాన్ని గోల్‌గా మలిచింది.

దీంతో భారత్‌ 3-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత కూడా సఫారీ జట్టు రక్షణను భారత ఆటగాళ్లు పదేపదే ఛేదించారు.

భారతదాడులను నిలువరించడంలో దక్షిణాఫ్రికా డిఫెండర్లు పూర్తిగా విఫలమయ్యారు.

వివరాలు

రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారీ విజయం..

38వ నిమిషంలో దీపిక మరో గోల్‌ సాధించింది. అనంతరం 44వ నిమిషంలో లాల్రెమ్సియామి, 45వ నిమిషంలో సాక్షి రాణా కూడా గోల్స్‌ నమోదు చేశారు.

దీంతో భారత్‌ 6-0తో భారీ ఆధిక్యంలో నిలిచింది. మ్యాచ్‌ ఇదే స్కోరుతో ముగుస్తుందని అంతా భావించారు.

మ్యాచ్‌ ముగియడానికి మరో ఐదు నిమిషాలు మాత్రమే ఉన్న సమయంలో దక్షిణాఫ్రికాకు ఓ గోల్‌ దక్కింది.

55వ నిమిషంలో డి వాల్‌ బంతిని భారత గోల్‌పోస్ట్‌లోకి పంపింది. దీంతో దక్షిణాఫ్రికా ఖాతాలో తొలి గోల్‌ చేరింది.

భారత్‌ 6-1తో విజయాన్ని సొంతం చేసుకుంది. చైనాతో తొలి మ్యాచ్‌ను డ్రాగా ముగించిన భారత్‌.. రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారీ విజయాన్ని నమోదు చేయడంతో టోర్నీలో ముందుకు సాగేందుకు అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది.

ADVERTISEMENT

వివరాలు

పూల్‌-డిలో భారత్‌ టాప్‌..

దక్షిణాఫ్రికాపై విజయంతో భారత్‌ పూల్‌-డి పట్టికలో 4 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది.

చైనా కూడా 4 పాయింట్లే సాధించినప్పటికీ గోల్స్‌ వ్యత్యాసం విషయంలో భారత్‌ ముందంజలో ఉంది. భారత్‌కు +8 గోల్స్‌ వ్యత్యాసం ఉండగా.. చైనాకు +6గా ఉంది.

3 పాయింట్లతో ఇంగ్లాండ్‌ మూడో స్థానంలో కొనసాగుతోంది. భారత్‌ తన చివరి పూల్‌ మ్యాచ్‌లో గురువారం ఇంగ్లాండ్‌తో తలపడనుంది.

ఈ మ్యాచ్‌ ఫలితం తదుపరి దశకు చేరడంలో కీలకం కానుంది. ఇదిలా ఉండగా.. పూల్‌-డి మరో మ్యాచ్‌లో చైనా 4-2తో ఇంగ్లాండ్‌ను ఓడించింది.

పూల్‌-సిలో జరిగిన పోరులో ఐర్లాండ్‌ 3-2తో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది.

పురుషులహాకీ ప్రపంచకప్‌లో మాజీ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా మరో విజయాన్ని నమోదు చేసింది.

ADVERTISEMENT