Kick boxing League: భారత్‌లో తొలిసారి కిక్‌బాక్సింగ్ సూపర్ లీగ్ ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో తొలిసారిగా కిక్‌బాక్సింగ్ సూపర్ లీగ్ (కేఎస్‌ఎల్) నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు దిల్లీలో లీగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. వాకో ఇండియా నేషనల్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరుగుతున్న సమయంలోనే కేఎస్‌ఎల్‌ను అధికారికంగా ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా కిక్‌బాక్సింగ్‌ను మరింత బలోపేతం చేయడం, ఈ క్రీడకు గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ఈ లీగ్‌ను ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
వివరాలు
తొలి సీజన్‌లో ఎనిమిది ఫ్రాంఛైజీ జట్లు
కేఎస్‌ఎల్ ద్వారా నిర్మాణాత్మకమైన పోటీలు నిర్వహించడం, అథ్లెట్లకు కాంట్రాక్టులు ఇవ్వడం, ప్రతిభకు ప్రోత్సాహకాలు అందించడం, మారుమూల ప్రాంతాల క్రీడాకారులకు మంచి అవకాశాలు కల్పించడం తమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు. తొలి సీజన్‌లో మొత్తం ఎనిమిది ఫ్రాంఛైజీ జట్లు పాల్గొంటాయని, ప్రతి జట్టులో 34 మంది ఫైటర్లు ఉంటారని తెలిపారు. ఈ లీగ్‌లో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చామని, మొత్తం క్రీడాకారుల్లో 60 శాతం పురుషులు, 40 శాతం మహిళలు ఉంటారని వెల్లడించారు. అదేవిధంగా 20 శాతం వరకు అంతర్జాతీయ అథ్లెట్లు కూడా పాల్గొనే అవకాశం ఉందన్నారు. లీగ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి రూ. కోటి నగదు బహుమతి అందజేస్తామని స్పష్టం చేశారు.
వివరాలు
ఎంపికైన క్రీడాకారులకు జట్ల యాజమాన్యాలతో సీజన్ వారీగా కాంట్రాక్టులు
కేఎస్‌ఎల్ సహ-వ్యవహస్థాపకుడు అజయ్ అడ్లఖ మాట్లాడుతూ.. ఈ లీగ్‌ను పటిష్ఠంగా, పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పారు. దీని వల్ల అథ్లెట్లు, జట్లు, భాగస్వాములందరికీ లాభం చేకూరుతుందని అన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రతినిధులు, జాతీయ క్రీడాశాఖ అధికారులు, క్రీడాకారులు, కోచ్‌లు తదితరులు పాల్గొన్నారు. ఈ లీగ్‌లో పాల్గొనాలనుకునే క్రీడాకారులు ముందుగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం దేశవ్యాప్తంగా ప్రత్యేక క్యాంపులు నిర్వహించి క్రీడాకారులను ఎంపిక చేస్తారు. ఆ తర్వాత క్రీడాకారుల వేలం ప్రక్రియ ఉంటుంది. ఎంపికైన క్రీడాకారులకు జట్ల యాజమాన్యాలతో సీజన్ వారీగా కాంట్రాక్టులు కుదుర్చుకుంటారు.