LOADING...
IND vs IRE : ఐర్లాండ్ అల్లర్ల ఎఫెక్ట్.. టీమిండియా సిరీస్‌పై సందిగ్ధత
ఐర్లాండ్ అల్లర్ల ఎఫెక్ట్.. టీమిండియా సిరీస్‌పై సందిగ్ధత

IND vs IRE : ఐర్లాండ్ అల్లర్ల ఎఫెక్ట్.. టీమిండియా సిరీస్‌పై సందిగ్ధత

వ్రాసిన వారు Moogati Shabari
Jun 12, 2026
01:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ జట్టు త్వరలో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఈ టూర్‌లో భాగంగా రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్ నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్ సిద్ధమైంది. సాధారణంగా ఐర్లాండ్‌తో జరిగే సిరీస్‌లు అంతగా చర్చనీయాంశం కావు. అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్‌పై ప్రత్యేక దృష్టి నెలకొనడానికి ప్రధాన కారణం 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. భారత సీనియర్ జట్టులో చోటు దక్కించుకున్న అతడు ఈ సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసే అవకాశముంది. కానీ అతని చారిత్రాత్మక ఎంట్రీకి ముందే ఈ సిరీస్ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఐర్లాండ్‌లో కొనసాగుతున్న హింసాత్మక అల్లర్లు ఇప్పుడు బీసీసీఐకి కొత్త తలనొప్పిగా మారాయి.

వివరాలు

స్థానిక ప్రజల్లో ఒక్కసారిగా పెరిగిన భయం, ఆగ్రహం..

నార్తర్న్ ఐర్లాండ్ రాజధాని బెల్‌ఫాస్ట్‌లో గత కొద్ది రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇటీవల చోటుచేసుకున్న ఒక దారుణ హత్యాయత్నం ఈ అశాంతికి కారణమైంది. గత వారం బెల్‌ఫాస్ట్‌లో సుడాన్‌కు చెందిన ఓ వలసదారుడు స్థానిక వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. అంతేకాకుండా అతడిని మరింత దారుణంగా హింసించేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో స్థానిక ప్రజల్లో భయం, ఆగ్రహం ఒక్కసారిగా పెరిగిపోయాయి.

వివరాలు

అప్రమత్తమైన బీసీసీఐ..

ఈ సంఘటన అనంతరం వలసదారులకు వ్యతిరేకంగా స్థానికులు పెద్ద సంఖ్యలో నిరసనలకు దిగారు. మొదట శాంతియుతంగా ప్రారంభమైన ఆందోళనలు క్రమంగా హింసాత్మక రూపం దాల్చాయి. ఆగ్రహంతో ఉన్న గుంపులు స్థానికేతరుల ఇళ్లు, వ్యాపార కేంద్రాలు, వాహనాలపై దాడులు జరిపి, కొన్ని ప్రాంతాల్లో నిప్పంటించిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ అల్లర్లకు ప్రధాన కేంద్రంగా బెల్‌ఫాస్ట్ మారడంతో అక్కడి శాంతిభద్రతల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇదే నగరంలో భారత జట్టు మ్యాచ్‌లు జరగాల్సి ఉండటంతో బీసీసీఐ అప్రమత్తమైంది.

Advertisement

వివరాలు

భారత్-ఐర్లాండ్ సిరీస్‌పై చర్చ..

భారత్-ఐర్లాండ్ జట్ల మధ్య జూన్ 27, జూన్ 29 తేదీల్లో రెండు టీ20 మ్యాచ్‌లు బెల్‌ఫాస్ట్‌లో జరగాల్సి ఉంది. ఇదే సమయంలో అక్కడి పరిస్థితులపై ఐర్లాండ్ క్రికెట్ బోర్డు స్థానిక ప్రభుత్వంతో కలిసి సమీక్ష నిర్వహిస్తోంది. రాబోయే రోజుల్లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోకపోతే మ్యాచ్‌లను మరో నగరానికి తరలించడం లేదా సిరీస్‌ను తాత్కాలికంగా వాయిదా వేయడం వంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో ఈ సిరీస్ యథావిధిగా జరుగుతుందా లేదా అనే ప్రశ్న ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

Advertisement